దుర్గమ్మ పంచహారతుల సేవలో.. | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ పంచహారతుల సేవలో..

Oct 24 2026 9:56 AM | Updated on Oct 24 2026 9:56 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ పంచహారతుల సేవలో దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ కుటుంబ సమేతంగా శుక్రవారం పాల్గొన్నారు. దసరా ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన రామచంద్రమోహన్‌కు ఆలయ ఈవో శీనానాయక్‌ సాదరంగా స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో కేంద్ర అదనపు కార్యదర్శి

దుర్గమ్మను కేంద్ర అదనపు కార్యదర్శి పంకజ్‌కుమార్‌ బన్సల్‌ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసిన పంకజ్‌కుమార్‌ బన్సల్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. అనంతరం ఆలయ ఏసీ రంగారావు, ఏఈవో ఎన్‌. రమేష్‌బాబులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

బంటుమిల్లి పీహెచ్‌సీలో రాష్ట్ర టీబీ బృందం

బంటుమిల్లి: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)నీ రాష్ట్ర టీబీ బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేట్‌ ఇంటర్నేషనల్‌ అస్సెస్‌మెంటు టీం, రాష్ట్ర టీబీ ప్రోగ్రాం ఆఫీసర్‌ రవీంద్ర, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ అధికారి డాక్టర్‌ అరవిందసెల్వీ పీహెచ్‌సీలోని టీబీ యూనిట్‌ను పరిశీలించారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్యసేవలపై వైద్యాధికారులు కేవీ పవన్‌కుమార్‌, సౌందర్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రోగులతో మాట్లాడారు. టీబీ ముక్త భారత్‌ అభియాన్‌ కార్యక్రమాల్లో భాగంగా 2030 నాటికి క్షయ వ్యాధి నివారణ లక్ష్యంగా పనిచేయాలంటూ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టరు ప్రేమ్‌చంద్‌ పీహెచ్‌సీని సందర్శించి వ్యాక్సిన్ల వివరాలు, రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం వైద్యాదికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించాలి

కోనేరుసెంటర్‌: కృష్ణా విశ్వవిద్యాలయంలో ‘మేధో సంపత్తి హక్కులు’ అనే అంశంపై శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీఎం ఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వర్సిటీ వీసీ కె. రాంజీ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం విద్యార్థులు ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌ వంటి ఏ రంగంలో ఉన్నప్పటికీ, ఒకే విభాగానికి పరిమితం కాకుండా అంతర్విభాగ, అంతరశాఖ, బహుళ విభాగాల కోర్సులను అభ్యసించడం ఎంతో ముఖ్యమని అన్నారు. విస్తృతమైన జ్ఞానం, విభిన్న రంగాలపై అవగాహన విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులు కేవలం సాంకేతికతను ఉపయోగించే వారిగానే కాకుండా, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే సృష్టికర్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సుందర్‌ కృష్ణ, ప్రొఫెసర్‌ బాబు రెడ్డి, ప్రొఫెసర్‌ కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement