చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 26 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన ఈ ప్రక్రియ మూడురోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా పార్టీల అభ్యర్థులను నామినేషన్లను స్వీకరించారు. రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ పర్యవేక్షణలో 26 మండలాలను ఐదు డివిజన్లుగా విభజించి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించారు. ఆఖరి రోజైన శుక్రవారం భారీగా నామినేషన్లను దాఖలు చేశారు. గత రెండు రోజుల్లో నామినేషన్ వేసిన కొంత మంది అభ్యర్థులు మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. మొదటిరోజు 14 నామినేషన్లు, రెండో రోజు 68, మూడో రోజు 115 మొత్తం 197 నామినేషన్లు 26 స్థానాలకు దాఖలయ్యాయి.
పార్టీల వారీగా..
మూడు రోజుల పాటు 26 జెడ్పీటీసీ స్థానాలకు 197 నామినేషన్లు దాఖలు కాగా వీటిలో పార్టీల వారీగా వైఎస్సార్ సీపీ 64, టీడీపీ 67, జనసేన 31, కాంగ్రెస్ 12, బీజేపీ 10, సీపీఎం 2, బీఎస్పీ 4, ఇండిపెండెండ్లు 7 నామినేషన్లు దాఖలు చేశారు.
ఎంపీటీసీ స్థానాలకు 1,756 నామినేషన్లు
జిల్లాలో 352 ఎంపీటీసీ స్థానాలకు మూడు రోజుల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 1756 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం 941 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడురోజులకు కలిపి పార్టీల వారీగా వచ్చిన నామినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ సీపీ 767, టీడీపీ 625, జనసేన 225, బీజేపీ 26, సీపీఎం 24, బీఎస్పీ 5, కాంగ్రెస్ 15, ఇండిపెండెంట్లు 69 నామినేషన్లు దాఖలయ్యాయి.
నేడు నామినేషన్ల పరిశీలన..
జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల పత్రాల పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో ఎం. శ్రీహరి తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు.


