నకిలీ డాక్యుమెంట్ల కేసులో ఐదుగురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ డాక్యుమెంట్ల కేసులో ఐదుగురు అరెస్టు

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

పెనమలూరు: మండల పరిధిలోని కానూరులో రూ.2 కోట్లకు పైగా విలువ చేసే స్థలంపై కన్నేసి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కాజేయాలని యత్నించిన ఐదుగురి పోలీసులు అరెస్టు చేశారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను డీఎస్పీ కోసూరి ధర్మేంద్ర శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు.. విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన బిక్కిన సుబ్బారావు దంపతులకు వంశీ, వల్లభనేని హిమబిందు సంతానం. కుమార్తె వివాహం అనంతరం అమెరికాలో ఉంటోంది. సుబ్బారావుకు కానూరులో ఆర్‌ఎస్‌ నంబర్‌ 36లో 1,600 గజాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంపై రియల్‌ ముఠా సభ్యులైన విజయవాడ మాచవరానికి చెందిన మందాడి ఆదిరెడ్డి (స్వస్థలం ప్రకాశం జిల్లా చిన్నకండ్లగుంట), దేవీ నగర్‌కు చెందిన మైనంపాటి వెంకటరమణ మణికుమార్‌, గుణదల కమ్మరవీధికి చెందిన ఆర్‌ఎంపీ రావెళ్ల శివాంజనేయులు, కానూరు పంటకాలువ ఫార్చూన్‌ రెసిడెన్సీకి చెందిన ఉప్పల సాంబశివ ఉదయ భాస్కర్‌రావు, ఉయ్యూరుకు చెందిన కాసాని అమలేశ్వరరావు కన్నుపడింది. 1,600 గజాల స్థలంలో హిమబిందు పేరున ఉన్న 800 గజాలను నకిలీ పత్రాలతో కాజేయాలని కుట్ర పన్నారు. సుబ్బారావు దంపతులు మరణించినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. అమెరికాలో ఉన్న హిమబిందు స్థానంలో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళను ఆ పత్రాల్లో చేర్చారు. ఆమె ఆధార్‌ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో ముఠాలో ఒకడైన మందాడి ఆదిరెడ్డి పేరుతో జీపీఏ చేశారు. అనంతరం ఫిబ్రవరిలో ఈ ముఠాలో మరో వ్యక్తి పేరున స్థలం రిజిస్ట్రేషన్‌ చేసి విక్రయానికి పెట్టారు.

బాఽధితుడి ఫిర్యాదుతో కదిలిన డొంక

తమకు తెలియకుండానే స్థలాన్ని విక్రయానికి పెట్టిన విషయం సుబ్బారావుకు తెలిసింది. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణచేపట్టడంతో ముఠా గుట్టురట్టయింది. నిందితులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో మరో నలుగురి పాత్ర ఉందని, వారిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో పెనమలూరు సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐలు సుధకర్‌, సందీప్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement