పెడనలో అనుమతులు, పన్నులు లేకుండానే బీడు భూముల తవ్వకాలు నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు తరలింపు అడ్డుకున్న వారిని బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు అధికారుల ఉదాసీనత? ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు
వాహనాలను నిలుపు చేయాలని ఆదేశించా
అధికారుల ఉచిత సలహాలు!
పెడన: బీడు పంట పొలాలను ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వి బుసకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు పెడనలో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వానికి ఎలాంటి దరఖాస్తు చేయకుండా, నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించకుండానే మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మమ్మల్ని ఎవడ్రా ఆపేదంటూ చిందులు తొక్కుతూ నంబర్లు లేని ట్రాక్టర్ల ద్వారా మట్టి దందాను సృష్టిస్తూ అడ్డు వచ్చిన వారిని బెదిరిస్తూ స్థానిక ప్రజాప్రతినిధి తాలుకా అంటూ రెచ్చిపోతున్న తమ్ముళ్లను అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తుండటం విశేషం. వీరి చర్యలను చూస్తున్న పురప్రజలు విస్తుపోతున్నారు.
సర్వత్రా విమర్శలు
అభివృద్ధి పనులంటూ దొంగతనంగా బుసకను తరలించాల్సిన దుస్థితిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనుల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఎటువంటి పన్నులు కట్టకుండా చేస్తున్నారా, ప్రైవేటు పరంగా చేసే అభి వృద్ధి పనులకు తీసుకువెళ్లి ప్రభుత్వానికి అంటకట్టడం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆయా ప్రైవేటు అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తే అవి ప్రభుత్వం చేసిన పనులు కింద జమ ఎలా అవుతాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి పన్ను చెల్లించని బుసకను ప్రైవేటు అభివృద్ధి పనులకు తరలించడంపై ఇటు అధికారులు, అటు పాలకులు కూడా వత్తాసు పలుకుతుండటంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చూసీ చూడనట్లుగా అధికారుల ధోరణి
నంబరు ప్లేట్లు లేని ట్రాక్టర్ల ద్వారా విచ్చల విడిగా బుసకను తరలించడంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. వాటిని అడ్డుకుని సీజ్ చేసి పన్నులు వేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ మట్టిని తోలడానికి వీల్లేదని కేకలు వేయడం పరిపాటిగా మారింది. ఆ తర్వాత షరా మాములుగానే మట్టి తోలకం పనులు మొదలు. అధికారులు ఇలా నడుచుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పల్లోటి స్కూలు పక్క రోడ్డు నుంచి పట్టణంలోకి మట్టి వస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. అక్కడకు సిబ్బందిని పంపించి వాహనాలు రాకుండా అడ్డుకున్నాం. వాహనాలు తిరిగితే మాత్రం ఫైన్ వేస్తామని వారికి తెలియజేశాం. వాహనాలు తిరగకుండా వీఆర్వోలను పర్యవేక్షించాలని ఆదేశించాం. వీఆర్వోలు ఏమాత్రం నిర్లక్ష్యంగా నడుచుకున్నా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– షేక్ వజీదా రహెమాన్, తహసీల్దార్, పెడన
రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నుంచే ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో మట్టిని తోలుకోవాలని, నంబర్ ప్లేట్లను ఎవరైనా ఫొటోలు తీసి పెడితే వాటి ఆధారంగా మిమ్మల్ని పిలవాల్సి వస్తోందని, అందుకే నంబర్లు లేకుండా బుసకను తరలించుకోవాలనే సలహాలు తీసుకుని యథేచ్చగా తవ్వేసి తీసుకుపోతున్నారు. బుసకను సొమ్ము చేసుకోవడం పట్టణంలోని కొందరు తమ్ముళ్లుపై పలువురు చర్చించుకోవడం, ఆ సొమ్ములు కాస్తా మున్సిపల్ ఎన్నికలకు వెచ్చించడానికే అన్నట్లుగా చెప్పకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


