ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండ చరియలు పడే ప్రాంతంలో శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సిబ్బందిని ఆదేశించారు. కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని కమిషనర్ రామచంద్రమోహన్, సాంకేతిక నిపుణుల బృందం శనివారం పరిశీలించింది. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న దేవ దాయ శాఖ కమిషనర్, ఎన్‌ఐఆర్‌ఎం(బెంగుళూరు)సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పర్యటించారు. అనంతరం మహా మండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్‌లో ఈవో శీనానాయక్, నిపుణుల బృందం, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. వర్షం నీటి ఊట కారణంగానే కొండ చరియలు జారిపడుతున్నాయని నిపుణుల బృందం పేర్కొంది. కొండ వాలును పటిష్టం చేసేందుకు అవసరమైన రాక్‌బోల్టింగ్ పనులు చేపట్టాలన్నారు. దసరా నాటికి ఘాట్‌రోడ్డును పూర్తిగా సురక్షితంగా ఉండేలా సాంకేతిక, ఇంజినీరింగ్ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఈవో శీనానాయక్, ఎన్‌ఐఆర్‌ఎం శాస్త్రవేత్త జైన్, సాంకేతిక సలహాదారు సుబ్బారావు, సీఈ శేఖర్, దుర్గగుడి ఈఈ రమ పాల్గొన్నారు.


