చిలుకూరు(ఇబ్రహీంపట్నం): ఎర్రుపాలెం నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి నూతన రైల్వే లైన్ ఏర్పాటుతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని మండలంలోని చిలుకూరు, దాములూరు గ్రామాల రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. రైల్వే అధికారుల ఒంటెత్తు పోకడలతో సుమారు 11 గ్రామాలు, ఆయా గ్రామాల పరీవా హక ప్రాంతంలోని 25 వేల ఎకరాల భూములు నీటి ముంపునకు గురై వ్యవసాయం ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైల్వే అధికారులు సుమారు 25 అడుగుల ఎత్తులో మట్టికట్ట పోసి దానిపై రైల్వే లైన్ నిర్మిస్తామని చెప్పారన్నారు. ఈ పరిణామాలతో రైల్వేలైన్ భూ సేకరణలో 70 మంది రైతులకు చెందిన సుమారు 100 ఎకరాల భూములు కోల్పోతున్నామన్నారు. ఈ ప్రాతంలో ఉన్న ఏడు వాగులు ప్రతి ఏడాది వర్షాకాలంలో పొంగి ప్రవహిస్తాయని, వాటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైల్వేలైన్ కింద కేవలం ఐదు కల్వర్టులు నిర్మిస్తే కట్టకు రెండు వైపులా నీటి ముంపునకు గురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 11 గ్రామాలతో పాటు 25 వేల ఎకరాల పంట పొలాలు నీటి ముంపునకు గురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఎకరం బయట మార్కెట్ విలువ రూ.17లక్షలు ఉందని, 2019–24 మధ్య సుమారు రూ.కోటి విలువ ఉందన్నారు. అప్పటి రేట్ల ప్రకారం ఎకరాకు రెండున్నర రెట్ల పరిహారం అందించాలని రైల్వే అధికారులను కోరారు. ఆందోళనలో రైతులు పూర్ణచంద్రరావు, వంశీకృష్ణ, కృష్ణారావు, కాటేపల్లి సుబ్బారావు, ఎర్రగుంట్ల నరేష్, మహిళా రైతులు పాల్గొన్నారు.


