లబ్బీపేట/మొగల్రాజపురం(విజయవాడతూర్పు): క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని, నిరంతరం బిజీగా ఉండే వృత్తి నిపుణులు ఆటలకు సమయం కేటాయించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు అన్నారు. నగరంలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఏఐ) అమరావతి చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నీ సీజన్ –2 పోటీలను ఆయన శనివారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి ప్రసంగించారు. అగ్నిప్రమాదాలు, సెక్యూరిటీ అంశాలపై ప్రజల్లో చైతన్యం తెస్తూ ఎఫ్‌ఎస్‌ఏఐ అందిస్తున్న సేవలు కొనియాడారు. ఎఫ్‌ఎస్‌ఏఐ అమరావతి చాప్టర్ అధ్యక్షుడు కాంతారావు, కార్యదర్శి వై.వి.దుర్గారావు మాట్లాడుతూ.. ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, ఫైర్ విభాగం అధికారులు, భద్రతా పరికరాల సంస్థలను ఒకే వేదికపైకి తెస్తూ సభ్యుల మధ్య స్ఫూర్తిని పెంచేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్నారు. మొత్తం 150 మంది సభ్యులతో కూడిన నాలుగు జట్లు తలపడుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మాజీ సంయుక్త కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, కోర్ కమిటీ సభ్యులు షేక్ పాదుషా, ప్రశాంత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.


