చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ’ఆపరేషన్ క్లీన్ స్వీప్’ విజయవంతమైందని కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు స్వచ్ఛాంధ్ర అవార్డులు లభించాయని పేర్కొన్నారు. బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా అభివృద్ధి చేసిన కృషికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు.
బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 23 నుంచి జూన్ 26 వరకు జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తరచూ చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి, అందుకు కారణాలను విశ్లే షించి, డోర్–టు–డోర్ చెత్త సేకరణలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించే చర్యలు చేపట్టామన్నారు. ఆ ప్రాంతాల్లో తిరిగి చెత్త వేయకుండా ఉండేలా మొక్కలు నాటడం, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయించడం, బెంచీలు ఏర్పాటు, పరిశుభ్రత సందేశాలతో అలంకరించడం వంటి చర్యల ద్వారా ఆ ప్రాంతాలను ఆహ్లాదకరమైన గ్రీన్ స్పాట్లుగా అభివృద్ధి చేశామని వివరించారు. జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం 141 బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా అభివృద్ధి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అమలు చేసిన ఈ వినూత్న కార్యక్రమాన్ని గుర్తించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన తొమ్మిది పురపాలక సంఘాల్లో మచిలీ పట్నం నగరపాలక సంస్థ, ఉయ్యూరు మునిసిపాలిటీకి స్వచ్ఛంధ్ర అవార్డులు ప్రదానం చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు, శానిటేషన్ సెక్రటరీ, మున్సిపల్ సిబ్బంది, మునిసిపల్ కమిషనర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు కలెక్టర్ బాలాజీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ఇదే స్ఫూర్తితో మరింత విస్తతంగా కొనసాగిస్తామని వెల్లడించారు.


