సీజేఐ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
గన్నవరం: రాష్ట్ర పర్యటనలో భాగంగా మార్చి 1న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు శుక్రవారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి శ్యామలరావు విమానాశ్రయంలో విశ్రాంత భవనంలోని రిజర్వ్ లాంజ్, సెక్యూరిటీ చెక్, నిర్గమన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడుతో కలిసి శ్యామలరావు భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజేఐ తిరుపతి నుంచి విమానంలో ఆదివారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటారని తెలిపారు. అమరావతి, విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీజేఐ తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని సాయంత్రం 6.30కు న్యూఢిల్లీ వెళ్తారని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి పర్యటనలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు. వైద్య సహాయం కోసం అంబులెన్స్, సమీపంలోని ఆస్పత్రులను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎంఎల్‌కే రెడ్డి, టర్మినల్ ఇన్‌చార్జ్ అంకిత్ జైస్వాల్, ప్రొటోకాల్ డైరెక్టర్ మోహన్‌రావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


