వృద్ధ దంపతులపై సైబర్ వల
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగించే ప్రయత్నం పోలీసుల అప్రమత్తతతో సైబర్ నేరగాళ్ల కుట్ర భగ్నం జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన వృద్ధ దంపతులు
కోనేరుసెంటర్: ‘హలో.. నేను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారిని... మీపై పెద్ద అభియోగమే పడింది.. మేము చేసిన స్పెషల్ ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులను పట్టుకున్నాం.. వారి మొబైల్‌లో మీ ఫోన్ నంబరుతో పాటు ఏటీఎం కార్డుకు సంబంధించిన లావాదేవీలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. సో మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారు. ఈ విషయం మీకు మాకు తప్ప మరెవరికీ తెలియకూడదు.. తెలిస్తే మీకే సమస్య తరువాత మీ ఇష్టం’ అంటూ ఓ సైబర్ నేరగాడు కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ వృద్ధ జంటను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ నేరగాడి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన పెద్దిరెడ్డి హరినాథ్ (రిటైర్డ్ బెల్ కంపెనీ ఉద్యోగి) తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆయనకు ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. ఫోన్‌లో పోలీసు యూనిఫామ్ ధరించిన ఓ వ్యక్తి లైన్‌లోకి వచ్చి తాను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారి అని పూణే నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. మీపై సీబీఐ కోర్టులో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, ఇటీవల నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా వారి వద్ద మీ ఏటీఎం కార్డును గుర్తించినట్లు చెప్పాడు. మీ కార్డు ఉగ్రవాదుల వద్ద ఎందుకు ఉందంటూ గదమాయించాడు. దంపతులు ఇరువురు కంగారు పడటంతో మీరిద్దరు ఉగ్రవాదులకు సహకరించినట్లు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ఆరోపిస్తూ ‘మిమ్మల్ని డిజిటల్‌గా అరెస్ట్ చేస్తున్నాం’ అంటూ భయభ్రాంతులకు గురి చేశాడు. అలా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీడియో కాల్‌లోనే ఉంచి మానసిక ఒత్తిడికి గురి చేశాడు. అయితే బాధితుల ఇంట్లో అద్దెకు ఉంటున్న మణి అనే వ్యక్తి రిటైర్డ్ ఉద్యోగి పడుతున్న ఇబ్బందిని గమనించిన ఆరా తీయగా, ‘నేను డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నాను’ అని హరినాథ్ చెప్పడంతో ఇది కచ్చితంగా సైబర్ నేరగాళ్ల మోసమేనని గ్రహించాడు. వెంటనే విషయాన్ని చిలకలపూడి పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ షేక్ అబ్దుల్ నభీ మరుక్షణమే బాధితుడి ఇంటికి చేరుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. సైబర్ నేరగాడితో మాట్లాడమని చెప్పి వీడియో కాల్ సంభాషణను గమనిస్తూ వచ్చాడు. బెదిరింపులు మితిమీరుతుండటంతో ఫోన్ వద్ద వెళ్లి అరే ఇడియట్ అంటూ మాట్లాడే ప్రయత్నం చేయగా కంగుతిన్న నేరగాడు ఫోన్ కట్ చేసి మాయమయ్యాడు. నేరగాళ్ల ఉచ్చు నుంచి కాపాడిన సీఐకి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.


