సమస్యల పరిష్కారం కోరుతూ ‘చలో కలెక్టరేట్’
మచిలీపట్నం అర్బన్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని కలెక్టరేట్‌లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.పోలినాయుడు మాట్లాడుతూ, జీతాల పెంపు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీఓలు 132, 142, 680లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ల విధానాన్ని రద్దు చేసి, హైకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని కోరారు. బీవోఎంఎస్ నంబర్36 ద్వారా ప్రకటించిన వేతనాలను జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగానే పంచాయతీ కార్మికులు, ఎన్‌ఎంఆర్‌లు, గ్రీన్ అంబాసిడర్లకు నెలకు రూ.21వేల వేతనం ప్రభుత్వం నేరుగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అన్ని కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేసి, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ, పెన్షన్, సెలవులు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించడంతో పాటు బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎం.గణేష్, ఎం.ప్రభుశేఖర్, ఎం.జగన్, వి. శ్రీనివాసరావు, సీహెచ్.మౌనిక, ఎన్.నాగేంద్రమ్మ, పి. కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.


