సర్వేల పేరుతో ఒత్తిడికి గురిచేస్తున్నారు
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన సచివాలయ ఉద్యోగులు
చిలకలపూడి(మచిలీ పట్నం): ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి సర్వేలకు విధులు కేటాయిస్తున్నారని దీని కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ జిల్లా అధ్యక్షులు జి. గోపీచంద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీకి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారని దీని కారణంగా సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవ్వటంతో పాటు మహిళా ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యాలయ పనివేళల సమయంలోనే సర్వే విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్‌ను గోపీచంద్ కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కార్యాలయ పనివేళల్లోనే విధులు నిర్వర్తించి వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి జిల్లాను మొదటిస్థానంలో ఉంచేలా ఉద్యోగులు కృషి చేయాలని సూచించారన్నారు. ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు ఎంవీ శ్యామ్‌నాథ్, ఏపీఆర్‌ఎస్‌ఏ ఉపాధ్యక్షుడు పామర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డు ఉద్యోగి మృతి
కంచికచర్ల: తమ భూమిని వేరొక మహిళ మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకుందని మనస్తాపం చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందిన సంఘటన మంగళవారం కంచికచర్లలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి. విశ్వనాథ్ కథనం మేరకు.. కంచికచర్ల అరుంధతీనగర్‌కు చెందిన మందా శ్యామ్యూల్(64) గతంలో ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. అతనికి 6.58 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని 2012లో ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామానికి చెందిన జాస్తి జ్యోతిర్మయి మోసపూరితంగా ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అయితే గతంలో శామ్యూల్ సివిల్ కోర్టుకు వెళ్లాడు. కోర్టులో ఆ భూమికి సంబంధించిన దావా నడుస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులకు గురై, తమ పొలం కోర్టు ద్వారా వస్తుందో రాదోనని ఆందోళన చెందాడు. మనస్తాపంతో శామ్యూల్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు కుమారుడు బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


