శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య కేసులో 12 మంది అరెస్టు
●వీరిలో ఆరుగురు మైనర్లు, ప్రిన్సిపాల్, ముగ్గురు అధ్యాపకులు
●డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి
పెనమలూరు: కృష్ణా జిల్లా పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీ శారదా భవన్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి మృతి చెందిన ఘటనలో 12 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. కేసులో అరెస్టు అయిన వారిలో ప్రిన్సిపాల్ పగడాల పిచ్చయ్య, ఐదుగురు సిబ్బందితో పాటు మరో ఆరుగురు విద్యార్థులు ఉన్నారన్నారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జరిగిందిదీ..
అనకాపల్లి జిల్లా బంగారుమెట్ట గ్రామానికి చెందిన బి.పవన్‌కుమార్(17) పోరంకి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతను కాలేజీ హాస్టల్‌లో సహచర విద్యార్థులతో 405 నంబర్ రూమ్‌లో ఉంటున్నాడు. పవన్‌కుమార్ గత నెల 31న రాత్రి స్టడీ అవర్‌కు వెళ్లకుండా తన గదిలో ఉరేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై తాము విచారణ చేయగా పవన్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి గల సంచలన విషయాలు వెలుగు చూశాయని డీఎస్పీ చెప్పారు. పవన్‌కుమార్‌తో హేమంత్ అనే విద్యార్థి సన్నిహితంగా ఉండేవాడన్నారు. ఇద్దరికీ గొడవలు జరగటంతో హేమంత్‌తో మాట్లాడవద్దని సహచర విద్యార్థులకు పవన్‌కుమార్ చెప్పడంతో వీరి మధ్య గొడవలు ముదిరాయన్నారు. గత నెల 5న పవన్‌కుమార్‌పై పలువురు విద్యార్థులు గొడవపడి దాడి చేశారన్నారు. సంక్రాంతి సెలవులు ముగిసిన తరువాత హాస్టల్‌కు వచ్చిన తరువాత గత నెల 28, 29 తేదీల్లో కూడా గొడవలు జరిగాయని, దీంతో మనస్తాపానికి గురైన పవన్‌కుమార్ హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడని చెప్పారు. గొడవపడిన ఆరుగురు విద్యార్థులు మైనర్లే అని తెలిపారు.
సాక్ష్యాలు చెరిపిన సిబ్బందిపై కేసు..
పవన్‌కుమార్ గది తలుపు తెరవకపోవడంతో ప్రిన్సిపాల్ పిచ్చయ్య, ఫ్లోర్ ఇన్‌చార్జి రవీంద్ర, మెస్‌బాయ్ హేమంత్, అధ్యాపకులు రాజేష్, ఆనంద్, కృష్ణ బలవంతంగా హాస్టల్ గది తలుపు తెరిచారు. అప్పటికే ఉరేసుకుని అపస్మారక స్థితిలో ఉన్న పవన్‌కుమార్ తన చేతిపై.. తనపై దాడి చేసిన విద్యార్థుల పేర్లు రాశాడు. ఇది గమనించిన సిబ్బంది చేతిపై రాసిన పేర్లు తుడిపేసి సాక్ష్యాలు మాయం చేశారని డీఎస్పీ చెప్పారు. విద్యార్థులు ఘటనను వీడియోలు తీయడం, కొన్ని వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. ఈ కేసులో దాడి చేసిన ఆరుగురు విద్యార్థులతో పాటు, సాక్ష్యాలు మాయం చేసిన కాలేజీ సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.


