బంగారు కాయిన్స్‌ పేరిట టోకరా | - | Sakshi
Sakshi News home page

బంగారు కాయిన్స్‌ పేరిట టోకరా

Feb 4 2026 8:23 AM | Updated on Feb 4 2026 8:23 AM

బంగార

బంగారు కాయిన్స్‌ పేరిట టోకరా

బంగారు కాయిన్స్‌ పేరిట టోకరా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

సినీఫక్కీలో రూ. 20లక్షలతో పరారైన ముఠా

పెనమలూరు: తక్కువ ధరకే బంగారు కాయిన్స్‌ ఇస్తామని నమ్మించిన గ్యాంగ్‌ పట్టపగలే సినీ ఫక్కీలో రూ.20లక్షలతో పరారైన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన రెక్కల తిరుపతిరెడ్డి విజయవాడలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతని చినతాత గానుగపంట నరసింహారెడ్డి కొద్ది రోజుల క్రితం ఫోన్‌ చేసి తనకు తెలిసిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మిత్రుల వద్ద బిల్లులు లేని బంగారు కాయిన్స్‌ తక్కువ ధరకే ఉన్నాయని చెప్పాడు. దీంతో వారిద్దరూ కలిసి బంగారం కాయిన్స్‌ ఉన్న చంద్రశేఖర్‌ (ట్రూకాలర్‌లో ఉన్న పేరు)అనే వ్యక్తికి ఫోన్‌ చేయగా.. అతను వీడియో కాల్‌లో బంగారు కాయిన్స్‌ చూపాడు. ఒక్కో కాయిన్‌ 20 గ్రాముల చొప్పున ఉన్నాయని, మొత్తం 17 కాయిన్స్‌ ఉన్నాయని వాటి విలువ రూ. 37.40 లక్షలని తెలిపాడు. దీంతో తిరుపతిరెడ్డి తమ వద్ద రూ. 20.50 లక్షలే ఉన్నాయని చెప్పాడు. అయితే మిగతా సొమ్ము తరువాత ఇవ్వమని రూ. 20లక్షలతో గంగూరు డీ మార్టు వద్దకు రమ్మని చంద్రశేఖర్‌ తెలిపాడు. దీంతో తిరుపతిరెడ్డి, నరసింహారెడ్డి, తిరుపతిరెడ్డి మామయ్య అయిన మల్లారెడ్డి, బంగారం షాపులో పనిచేసే మరో వ్యక్తి కలిసి సోమవారం మధ్యాహ్నం గంగూరు వద్దకు కారులో వచ్చారు.

బ్యాగ్‌ తీసుకొని పరార్‌..

గంగూరులో కారు వద్దకు ఒక వ్యక్తి వచ్చి రోడ్డుకు మరో పక్కన ఉన్న కారులో బంగారు కాయిన్స్‌ ఉన్నాయని చెప్పాడు. దీంతో తిరుపతిరెడ్డి బ్యాగ్‌లో ఉన్న నగదును వచ్చిన వ్యక్తికి చూపి బ్యాగ్‌ను అతనికి ఇచ్చాడు. ఇద్దరు బంగారు కాయిన్స్‌ ఉన్నాయన్న కారు వద్దకు వెళ్లిన తరువాత.. క్యాష్‌ బ్యాగ్‌ పట్టుకున్న వ్యక్తి కారులో బ్యాగ్‌ పెట్టి కారు ఎక్కాడు. తిరుపతిరెడ్డి కూడా కారు ఎక్కే ప్రయత్నం చేయగా కారులో ఉన్న వ్యక్తులు తిరుపతిరెడ్డిని బలంగా తోసి కారు వేగంగా డ్రైవ్‌ చూసుకుంటూ వెళ్లి పోయారు. కిందపడిన తిరుపతిరెడ్డికి గాయాలు అవ్వగా, బాధితుడు వెంటనే పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బైక్‌ అదుపు తప్పి వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఘటన

ఉయ్యూరు రూరల్‌: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన మానుకొండ పృధ్వీ తేజ(14), మానికొండ జానకి రామయ్య(14)తోపాటు తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామానికి చెందిన పిల్లం వెంకట్‌(17) బైక్‌పై మచిలీపట్నం నుంచి కంకిపాడుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల వద్ద జాతీయ రహదారిపైగల డివైడర్‌పై ఉన్న మొక్కలకు వాటర్‌ ట్యాంకర్‌తో నీళ్లు పోస్తుండగా యువకుల బైక్‌ అదుపుతప్పి వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టారు. దీంతో పృధ్వీ తేజ, పిల్లం వెంకట్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ మానికొండ జానకి రామయ్యను స్థానికుల సాయంతో 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఉయ్యూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేశ్వరి తెలిపారు.

తోటచర్ల(పెనుగంచిప్రోలు): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని తోటచర్ల వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఛిత్రచేడు సతీష్‌ కుమార్‌(28) కోదాడ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో అతని రెండు కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఎస్‌ఐ ఎంఎస్‌కే అర్జున్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతులు పిల్లం వెంకట్‌,

మానుకొండ పృధ్వీ తేజ

బంగారు కాయిన్స్‌ పేరిట టోకరా 1
1/1

బంగారు కాయిన్స్‌ పేరిట టోకరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement