కాల్వలు.. కడగండ్లు!
చానళ్లు, డ్రెయిన్ల అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం
గుడివాడరూరల్: రైతాంగానికి మేలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు సాగు నీరు అందించే, మురుగునీటిని బయటకు పంపించే డ్రెయిన్లు, చానళ్ల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపుతామని, నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతన్నలను మోసగించారు. సాగునీటి సంఘాల పేరుతో అడ్డగోలుగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. సంబంధిత అధికారులు సంఘాలతో కుమ్మకై ్క పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
బుడమేరు.. కన్నీరు..
నందివాడ మండలంలోని మేజర్ డ్రెయిన్ అయిన బుడమేరులో మెయింటెనెన్స్ పనులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు నిర్వహించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్ల ప్రక్రియకు తిలోదకాలు ఇచ్చి సాగునీటి సంఘాలకు పనులను అప్పగించారు. ఏడాది పొడవునా పూడికతీత పనులకు సంబంధించి తూర్పు కృష్ణాడెల్టా కమిటీ చైర్మన్ పనులు నిర్వహణ చూడాల్సి ఉంది. అయితే రెండేళ్ల కాలంలో ఏ రోజు చైర్మన్ పనులు చేసిన దాఖలాలు లేవు. పుట్టగుంట, అరిపిరాల, రామాపురం, కుదరవల్లి, ఎల్‌ఎన్ పురం గ్రామాల వద్ద ఎక్కడ చూసినా గుర్రపుడెక్క దర్శనమిస్తోంది. గతంలో బుడమేరుకు వరదలు వచ్చిన సమయంలో మెయింటెనెన్స్ పనులు సక్రమంగా చేయకపోవడంతో గ్రామాలు నెలల తరబడి ముంపునకు గురై పంట పొలాలు నీట మునిగిన దాఖలాలు ఉన్నాయి.
మరో మేజర్ డ్రెయిన్ అయిన చంద్రయ్య డ్రెయిన్ పరిస్థితి ఇదే. గత రెండేళ్లలో ఎక్కడా గుర్రపుడెక్క తొలగించకపోవడంతో లింగవరం, తమిరిశ, గొంగళ్లమూడి, అనమనపూడి, పోలుకొండ రెగ్యులేటర్ వద్ద భారీస్థాయిలో గుర్రపుడెక్క మేటవేసుకుపోయింది. గుడివాడ పట్టణంలోని మురుగునీరు సైతం ఈ డ్రెయిన్ ద్వారానే కొల్లేరులో కలవాల్సి ఉంది. సదరు చైర్మన్ సక్రమంగా పనులు నిర్వహించకపోవడంతో మురుగునీరు ఎగువ నుంచి దిగువకు సక్రమంగా ప్రవహించక మేటవేసుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు సైతం ముంపునకు గురైన పరిస్థితి దాపురించింది.
నెహ్రల్లీ.. అదే దుస్థితి..
నందివాడ పరిధిలో ఉన్న నెహ్రల్లీ డ్రెయిన్‌ది ఇదే పరిస్థితి. రెండేళ్లుగా పూడిక తీత, మెయింటెనెన్స్ పనులు చేపట్టకపోవడంతో నీరు ప్రవహించడం లేదు. దీంతో పరిసర ప్రాంత ఆక్వా రైతులకు సాగునీరు అందని దుస్థితి ఏర్పడింది. ప్రధాన చానల్స్ అయిన దోసపాడు, గుడివాడ, మోటూరు, అరిపిరాల చానల్స్‌ది ఇదే పరిస్థితి.
కూటమి నేతలతో అధికారులు మిలాఖత్..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చానల్స్, డ్రెయిన్‌లు, కాల్వల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడం, ఆ పనులను సొంత పార్టీ నేతలతో కాకుండా టెండర్ల ప్రక్రియ ద్వారా పట్టభద్రులతో సమర్థంగా నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సంక్షేమాన్ని తుంగలోకి తొక్కి సొంత పార్టీ నేతల స్వార్థమే ధ్యేయంగా కనీస అవగాహన లేని పార్టీ నేతలకు సాగునీటి సంఘాల అధ్యక్ష బాధ్యతలను అప్పగించి పనులు నిర్వహణ చూడాలని చెప్పారు. కూటమి నేతలు ధనార్జనే ధ్యేయంగా మెయింటెనెన్స్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. పనులు చేయకుండానే బిల్లులు అధికారులతో కుమ్మకై ్క చేజిక్కించుకుంటున్నారు. ప్రధాన డ్రెయిన్‌లు, చానల్స్ పూడిక తీత పనులను విస్మరించి చెయ్యని పనులకు అడ్డగోలుగా బిల్లులు చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరిపిరాల చానల్‌లో దట్టంగా ఉన్న
గుర్రపుడెక్క, తూడు
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అదే నిర్లక్ష్యం
సాగునీటి సంఘాలతో అడ్డగోలుగా చెయ్యని పనులకు బిల్లులు
మెయింటెనెన్స్ నిధులను
దారిమళ్లిస్తున్న వైనం
అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు
మరో మేజర్ డ్రెయిన్ ఆత్కూరుది ఇదే పరిస్థితి. పెదలింగాల, చినలింగాల, ఒద్దులమెరక, చేదుర్తిపాడు, ఉంగుటూరు మండలంలోని వేలాది ఎకరాల మురుగునీటిని బుడమేరులోకి తీసుకెళ్లే ఆత్కూరు డ్రెయిన్ రెండేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఏటా రూ.30లక్షలు చొప్పున రెండేళ్ల కాలంలో రూ.60లక్షలు డ్రెయిన్ మెయింటెనెన్స్, పూడిక తీతకు కేటాయించినా అధికార పార్టీ సాగునీటి సంఘాల అధ్యక్షులు పనులు చేయకుండానే బిల్లులు చేజిక్కించుకుంటున్నారు.
కాల్వలు.. కడగండ్లు!


