ఇనుప రాడ్లు, రాళ్లతో కొట్టుకున్న టీడీపీ నేతలు
ఐదుగురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం జగ్గయ్యపేట మండలం బూదవాడలో ఘటన సర్పంచ్ ఎన్నికల పోటీ విషయమే కారణం
బూదవాడ (జగ్గయ్యపేట): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీపై ఆధిపత్య పోరు నేపథ్యంలో శనివారం రాత్రి టీడీపీలోని రెండు వర్గాలు దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గడ్డం ఏసుబాబు, శీలం లక్ష్మయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. మూడు నెలల క్రితం గ్రామంలో జరిగిన వివాదంలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగటంతో పోలీసులు సర్దిచెప్పారు. శనివారం రాత్రి లక్ష్మయ్య వర్గానికి చెందిన ఉపాధి హామీ పథకం మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం నరేష్‌బాబు సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో తండ్రి గడ్డం నాగేశ్వరరావుతో కలిసి పని చేస్తున్నాడు. అదే సమయలో గడ్డం వెంకటచందు ద్విచక్ర వాహనంపై రాగా.. వారి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం గ్రామంలోని బొడ్డరాయి సెంటరు వచ్చిన తరువాత వివాదం ముదిరి రెండు వర్గాలు ఇనుప రాడ్లు, రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో గడ్డం దానియేలు, మోహన్, యామర్తి సైదులు, గడ్డం నరేష్‌బాబు, గోవిందు బ్రహ్మంకు తీవ్ర గాయాలయ్యాయి. గడ్డం నాగేశ్వరరావుకు రెండు కాళ్లు, రెండు చేతులు విరిగి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. రెండువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్టు చిల్లకల్లు ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్ ఆదివారం తెలిపారు.
ఇనుప రాడ్లు, రాళ్లతో కొట్టుకున్న టీడీపీ నేతలు
ఇనుప రాడ్లు, రాళ్లతో కొట్టుకున్న టీడీపీ నేతలు


