మృతదేహానికి 12 రోజుల తర్వాత పోస్టుమార్టం | - | Sakshi
Sakshi News home page

మృతదేహానికి 12 రోజుల తర్వాత పోస్టుమార్టం

Aug 22 2025 6:55 AM | Updated on Aug 22 2025 6:55 AM

మృతదేహానికి 12 రోజుల తర్వాత పోస్టుమార్టం

మృతదేహానికి 12 రోజుల తర్వాత పోస్టుమార్టం

గన్నవరం: ఓ వ్యక్తి మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు 12 రోజుల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటన మండలంలోని చిక్కవరం శివారు చింతగుంట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. చింతగుంట గ్రామానికి చెందిన డోలా లక్ష్మణ్‌కుమార్‌(35) కారు డ్రైవర్‌. సుమారు 14 ఏళ్ల క్రితం జక్కంపూడికి చెందిన బిందుపావనితో అతనికి ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. నాలుగు నెలల క్రితం కేసరపల్లి శివారు వీఎన్‌ పురం కాలనీలో లక్ష్మణ్‌కుమార్‌ ఇళ్లు అద్దెకు తీసుకుని కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఈ నెల 10వ తేదీ తెల్లవారుజామున లక్ష్మణ్‌కుమార్‌ గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా బిందుపావని అతని తల్లిదండ్రులు, బంధువులకు తెలియజేసింది. దీంతో మృతదేహాన్ని చింతగుంటకు తీసుకువెళ్లి మత సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మణ్‌కుమార్‌ మృతిపై అతని కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు గన్నవరం పోలీసులను ఆశ్రయించి అతని తండ్రి డోలా ఏసుపాదం ఫిర్యాదు చేశారు. లక్ష్మణ్‌కుమార్‌ మృతి చెందినప్పుడు అతని స్నేహితుడు చింతగుంటకు చెందిన దేవరపల్లి ప్రదీప్‌ కూడా అక్కడే ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడు మృతి విషయంలో కోడలు బిందుపావని, అతని స్నేహితుడు ప్రదీప్‌పై అనుమానాలు ఉన్నట్లుగా ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తహసీల్దార్‌ కె. వెంకటశివయ్య సమక్షంలో లక్ష్మణ్‌కుమార్‌ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని సీఐ బి.వి.శివప్రసాద్‌ తెలిపారు.

మినుముల దొంగలు అరెస్ట్‌

పామర్రు(మొవ్వ): దొంగలించిన మినుములను అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకుని మినుములు, తరలిస్తున్న కారును, దోస్త్‌ వ్యాన్‌ను సీజ్‌ చేసినట్లు పామర్రు ఎస్‌ఐ వి.రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. పామర్రు పీఎస్‌లో సీఐ శుభాకర్‌తో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన పామర్రుకు చెందిన ఊటుకూరి వీరు వెంకట సత్యనారాయణ మినుముల దుకాణంలో రెండు లక్షల విలువచేసే 20 క్వింటాళ్ల (40 సారలు) మినుములు చోరీకి గురయ్యాయి. దీనిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా మని, సీసీ పుటేజ్‌, సెల్‌ టవర్‌ కాల్‌ డేటాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు వివరించారు. పామర్రు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శుభాకర్‌ పర్యవేక్షణలో పామర్రు ఎస్‌ఐ వి.రాజేంద్ర ప్రసాద్‌ గురువారం పామర్రుకు చెందిన నంబూరి శివరామకృష్ణ, శాఖమూరి మనోజ్‌కుమార్‌, యలవర్తి గోపీకృష్ణలను పామర్రు నేషనల్‌ హైవే 65వ ఫ్లైఓవర్‌ వద్ద దొంగలించిన మినుములతో పట్టుకున్నట్లు వెల్లడించారు. వాటిని తరలించడానికి వినియోగించిన ఏపీ39డబ్య్లుఈ 7961, దోస్త్‌ వ్యాన్‌, ఏపీ40సీబీ9487 కార్‌ని సీజ్‌ చేసి ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కి పంపినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement