
ఉన్మాద పాలన
నందిగామటౌన్: రాష్ట్రంలో గత 13 నెలలుగా ఉన్మాద పాలన సాగుతోందని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు అన్నారు. ఇందులో భాగంగానే నందిగామలో అధికారులు గురువారం అర్ధరాత్రి అరాచకానికి పాల్పడ్డారన్నారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లం ఘించి గాంధీ సెంటర్‌లో ఉన్న మహానేత విగ్రహాన్ని క్రేన్‌లతో తొలగించి తీసుకువెళ్లి మున్సిపల్ కార్యా లయంలో పడేశారన్నారు. మహానేత విగ్రహాన్ని తొలగించటాన్ని నిరసిస్తూ డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు నాయకత్వంలో శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి గాంధీ సెంటరులోని మహానేత విగ్రహం వరకు పాదయాత్రగా వెళ్లి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగన్‌మోహనరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కూటమి నేతలు తొలగించి ప్రజల హృదయాలలో ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేశారని అన్నారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు అధికారులు కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించారని అన్నారు. అధికార పార్టీ నేతల ధన దాహానికి రాఘవాపురం కొండ విరిగి పడి ఓ వ్యక్తి మృతి చెందితే రెండవ కంటికి తెలియకుండా సెటిల్‌మెంట్ చేసి బాధిత కుటుంబానికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.
వినతిపత్రం అందజేత..
గాంధీ సెంటరులోని రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కన్వీనర్ దేవినేని అవినాష్, నాయకులు నల్లగట్ల స్వామిదాసు, పూనూరు గౌతమ్‌రెడ్డి, ఇంటూరి రాజగోపాల్‌తో కలిసి సీఐ వైవీఎల్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. విగ్రహాన్ని తొలగిస్తున్న సమయంలో అటుగా వస్తున్న మహిళా సర్పంచ్‌ను, ఆమె భర్తను సైతం ఇష్టారీతిన అసభ్య పదజాలంతో దూషించి కారు అద్దాలపై గుద్దుతూ భయభ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు లాక్కుని దిక్కున్న చోట చెప్పుకోండంటూ వ్యవహరించిన తీరు అమానవీయమని అన్నారు. ఇప్పటికై నా పోలీసులు స్పందించి విగ్రహాన్ని తొలగించేందుకు సహకరించిన వారితో పాటు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు ముక్కపాటి నరసింహారావు, వేల్పుల ప్రశాంతి, ఎంపీపీలు పెసరమల్లి రమాదేవి, మలక్ బషీర్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు మంగునూరి కొండారెడ్డి, కాలవ వాసుదేవరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, పట్టణ, మండల కన్వీనర్‌లు మహ్మద్ మస్తాన్, వేమా సురేష్‌బాబు, మంచాల చంద్రశేఖర్, బండి మల్లికార్జునరావు, ఆవుల రమేష్ బాబు, కందుల నాగేశ్వరరావు, నెలకుదిటి శివనాగేశ్వరరావు, షేక్ షహనాజ్ బేగం, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నందిగామలో అర్ధరాత్రి మహానేత విగ్రహం తొలగింపు హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేసిన అధికారులు కూటమి నేతల మెప్పు పొందేందుకే ఈ దుశ్చర్య నిరసనగా పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహనరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అవినాష్, పార్టీ నేతలు