ప్రతి ఫిర్యాదును పరిష్కరించండి
మీ కోసంలో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: మీ కోసంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఖచ్చితంగా పరిష్కరించాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 33 మంది బాధితుల ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులు అందించిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..
కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించారు. మరికొన్ని అర్జీలను చట్ట పరిధిలో విచారణ జరిపి తదుపరి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీ కోసంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు, సిబ్బంది గౌరవంగా స్వీకరించాలన్నారు. సమస్య ఎలాంటిదైనా తొలుత అర్జీని అందుకుని పూర్తి విచారణ జరిపిన తరువాత చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించాలని చెప్పారు. బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా మసులుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసినా, అమర్యాదగా మాట్లాడినట్లు తన దృష్టికి వచ్చినా సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వచ్చిన అర్జీల్లో కొన్ని..
● గుడివాడకు చెందిన మాధవి అనే యువతి ఎస్పీని కలిసి ఆర్థిక అవసరాల నిమిత్తం తన స్నేహితురాలికి రెండు లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చానని తెలిపింది. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమని అడుగుతుంటే స్నేహితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను దూషిస్తూ దాడికి సైతం దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
● అవనిగడ్డ నుంచి బాలస్వామి అనే రైతు తన వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటుండగా సరిహద్దుదారుడు తన పొలంలోకి వెళ్లేందుకు దారి ఇవ్వకపోగా దాడికి దిగుతున్నాడని తెలిపాడు. అతనిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరాడు.
● గన్నవరానికి చెందిన దివ్య అనే మహిళ నాలుగేళ్ల క్రితం తనకు వివాహం జరిగిందని భర్త, ఆయన కుటుంబ సభ్యులు అధిక కట్నం తీసుకురావాలని ప్రతి రోజు వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


