పెంచికల్పేట్: భూ హద్దుల నిర్ధారణ, రెవెన్యూ రికార్డుల సవరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 107 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 8 రెవెన్యూ గ్రామాల్లో మాత్రమే ప్రక్రియ పూర్తయింది. క్షేత్రస్థాయిలో సర్వేకు వస్తున్న ప్రత్యేక బృందాలు ముందస్తుగానే రైతులకు నోటీసులు అందిస్తున్నా వ్యవసాయ పనుల నేపథ్యంలో రైతుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదని, దీంతో సర్వే ప్రక్రియ మందగించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రీసర్వే ప్రక్రియను డిసెంబర్ లోపు పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేయడంతో రీసర్వే ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కేవలం 8 గ్రామాల్లో పూర్తి..
జిల్లాలో అధికారులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి రీ సర్వే ప్రక్రియను ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రారంభించారు. 8 మంది రెగ్యులర్ సర్వేయర్లతో పాటు అదనంగా 15 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను బృందాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక రీసర్వేకు జిల్లా స్థాయిలో శిక్షణ అఽందించి ప్రక్రియ ప్రారంభించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే బృందాలు స్థానికంగా ఉన్న జీపీవోల సహాయంతో రీసర్వే చేయాల్సిన సర్వే నంబర్లలో ఉన్న రైతులకు ముందుగానే నోటీసులు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 18 గ్రామాల్లో సర్వే ప్రారంభించగా దహెగాం మండలంలోని అమరగొండ, బెజ్జూర్ మండలంలోని రేచిని, కౌటాల మండలంలోని బాలెపల్లి, కాగజ్నగర్ మండలంలోని సీతానగర్, ఆసిఫాబాద్ మండలంలోని దానాపూ, మేకలగూడ, రెబ్బెన మండలంలోని సీతానగర్, పకిడిపల్లి గ్రామాల్లో మాత్రమే భూ రీసర్వే పూర్తయ్యింది. మరో పది గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది.
బృందాలకు తప్పని తిప్పలు..
రీసర్వే జరిగే సర్వే నంబర్లలో సాగులో ఉన్న రైతులకు ముందుగానే అధికారులు నోటీసులను అందిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో రైతులు వరి సాగు చేస్తున్న నేపథ్యంలో సర్వే బృందాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి 4.30 గంటలకు సర్వే చేస్తున్న బృందాలు ప్రతీరోజు కేవలం 30 నుంచి 40 ఎకరాలకు మాత్రమే హద్దులు నిర్ణయిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములు, ఇరిగేషన్ భూములు, గ్రామాల హద్దులు నిర్ణయించి సర్వేలో ముందుకు సాగుతున్నారు. వరి పంట సాగుకు రైతులు అధిక ప్రాధాన్యత ఇవ్వడం.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి పంట వద్దే ఎక్కువ సమయం కేటాయిస్తుండడంతో సర్వే ప్రక్రియలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సర్వే బృందాలు పేర్కొంటున్నాయి.
రీసర్వే ప్రక్రియ వేగవంతం చేస్తాం..
గెజిట్లో ఉన్న 18 గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభించగా 8 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గడువులోగా రీసర్వే ప్రక్రియను పూర్తి చేయడానికి అదనంగా సిబ్బందిని నియమిస్తున్నాం. గ్రామాల హద్దుల గుర్తింపు సర్వే నంబర్లను ముందుగా సర్వే చేస్తున్నాం. సర్వే చేసిన భూములకు సంబంధించిన రైతులకు వివరాలు అందిస్తాం. రీసర్వేతో భూములకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో రైతులు అప్పీల్ చేసుకోవచ్చు. రైతులు రీసర్వేకు సహకరించాలి. – వినయ్ కుమార్, సర్వేల్యాండ్స్ ఏడీ


