కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) లో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ఆశలకు హైకోర్టులో బ్రేక్ పడింది. ఎన్నికలకు సంబంధించిన కేసును హైకోర్టు నవంబర్ 16కు వాయిదా వేసింది. దీంతో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు నిరాశే ఎదురైంది. 2018లో ఎన్సీఎల్టీ కోర్టు జేకే యాజమాన్యానికి మిల్లును అప్పగించింది. అప్పటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కోనప్పలు పునఃప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. మిల్లులో క్యాంటీన్, ఇతర సదుపాయాలు లేవని, జీతాలు తగ్గించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహిస్తే తమ హక్కులు అమలవుతాయని వారు భావిస్తున్నారు. 2024లో మిల్లులో 15 కార్మిక సంఘాలు ఉండగా ఇందులో కార్మికశాఖ ముందుగా అర్హులైన సంఘాలను గుర్తించాలని యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. కానీ కార్మిక శాఖ అప్పటికే కార్మిక సంఘాల నుంచి వార్షిక నివేదికలు తీసుకొని పరిశీలించి అర్హత కలిగిన 10 సంఘాలను గుర్తించింది. అనంతరం కార్మిక శాఖ సంఘాలతో సమావేశం నిర్వహించగా యాజమాన్యం హాజరు కాలేదు.
జేఏసీగా ఏర్పడి దీక్షలు
యాజమాన్యం మిల్లులోని సంఘాల గుర్తింపును తేల్చాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు వీగిపోగా మూడు లేబర్ కోడ్లలో ఐఆర్ కోడ్లను ఆధారంగా చేసుకుని యాజమాన్యం మరోసారి హైకోర్టు తలుపు తట్టింది. కార్మిక శాఖ తరఫు న్యాయవాది ఎన్నికల ప్రక్రియ నిర్వహించబోమని కోర్టుకు చెప్పడంతో ఏటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కార్మిక సంఘాలు ఒక్కటై జేఏసీగా ఏర్పడ్డాయి. మే నెలలో రిలే దీక్షలు సైతం ప్రారంభించాయి.
కార్మికుల నిరాశ..
ఈనెల 13న కేసు బెంచ్ మీదకు రాగా, కార్మిక శాఖ అడ్వకేట్ జనరల్ హాజరై కార్మికులకు అనుకూలంగా వాదనలు వినిపించారు. యాజమాన్యం అడ్వకేట్ మళ్లీ కౌంటర్ పిటిషన్ వేయడం కోసం సమయం కోరగా కేసు నవంబర్ 16కు వాయిదా పడింది. దీంతో తుది తీర్పు వస్తుందని భావించిన కార్మికుల ఆశలు ఆవిరయ్యాయి. లేబర్ కోడ్ అమలయ్యే వరకు కాలయాపన చేయాలని యాజమాన్యం చూస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.


