బడి వంట..
ఆసిఫాబాద్‌రూరల్: సర్కారు బడిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న కార్మికులకు వర్షాలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలాచోట్ల కిచెన్ షెడ్లు లేకపోవడం, గ్యాస్‌పొయ్యిలు వినియోగంలో లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. కట్టెల పొయ్యిలపై ఇరుకు షెడ్లలో పొగలోనే వంట చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. గతంలో గ్యాస్ పొయ్యిలు అందించినా వాటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేదు. ప్రస్తుతం అవి పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి నిర్వాహకులు వంటి వద్దే వంట చేసి పిల్లలకు వడ్డిస్తున్నారు.
617 స్కూళ్లకు షెడ్లు లేవు..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 992 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులు డీఈవో పరిధిలో 720 పాఠశాలలు, గిరిజన శాఖ పరిధిలో 272 పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిల్లో 375 పాఠశాలకు మాత్రమే కిచెన్ షెడ్లు ఉండగా, 617 పాఠశాలలకు షెడ్లు లేవు. ఆయా చోట్ల ఆరుబయట, ఇంట్లో వంట చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 992 పాఠశాలల్లో 517 స్కూళ్లకు గతంలో గ్యాస్ పొయ్యిలు, వంట పాత్రలు అందించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో చాలామంది వినియోగించడం లేదు. కట్టెలతో వంట చేస్తూ పొగకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం కావడంతో వంట చెరుకు కొరత కూడా వేధిస్తోంది. కట్టెలు తడిసిన సమయంలో భోజనం ఆలస్యమవుతుంది. కట్టెల పొయ్యి వంటతో గాయాలు కూడా అవుతున్నాయని నిర్వాహకులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిలిండర్లు అందించాలి
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రభుత్వం గ్యాస్ పొయ్యితోపాటు సిలిండర్లు ఉచితంగా అందించి ఆదుకోవాలి. కట్టెలతో వంట చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో మరింత అవస్థలు పడుతున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై దృష్టి సారించాలి.
– కమల, మధ్యాహ్న భోజన
నిర్వాహకులు, మోతుగూడ
ఇరుకు గదిలో ఇక్కట్లు
లింగాపూర్: లింగాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వందమంది వరకు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలకు చెందిన కిచెన్ షెడ్డు ఇరుకుగా ఉంది. వంట సామగ్రి పెట్టుకునేందుకు కూడా సరిపోవడం లేదు. అలాగే కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో కిచెన్ షెడ్లు లేని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. యూడైస్‌లో పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులను పొందుపర్చాం. బడులకు కల్పించాలని సౌకర్యాల గురించి ప్రభుత్వానికి నివేదించాం.
– సచ్చిదానంద చారి, డీఈవో


