రెబ్బెన: మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13జిల్లాల మీదుగా 17రోజులపాటు నిర్వహించిన వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్రకు గుర్తింపుగా గోలేటికి చెందిన ఓరగంటి రంజిత్‌కుమార్ ఇండియన్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా రంజిత్‌ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన నివాసంలో శనివారం అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుకురావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువతలో చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతను సానుకూల దిశగా నడిపించడమే కాకుండా సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన రంజిత్ సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు మరిన్ని చేపట్టి యువతలో చైతన్యం తేవాలని సూచించారు. కార్య క్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


