రెబ్బెన: గనుల నిర్వహణ, అధిక బొగ్గు ఉత్పత్తి సాధనకు ఆధునిక సాంకేతికత కలిగిన యంత్రాలు ఎంతో కీలకమని జీఎం శ్రీ రమేశ్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో బుధవారం నూతన క్రేన్‌కు పూజలు చేసి ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ అధిక ఉత్పత్తి సాధించాలని సూచించారు. ఉత్పాదకత పెంపు, నిర్వహణ పనుల్లో వేగం, భద్రత ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా సంస్థ ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్రేన్ 12 టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుందని, భారీ యంత్రాల మరమ్మతు, విడిభాగాల తరలింపు, నిర్వహణ పనులు సులభతరంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ప్రాజెక్టు అధికారి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, డీజీఎం పర్సనల్ కిరణ్‌బాబు, సేఫ్టీ అధికారి మధుసూదన్, మేనేజర్ శంకర్, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


