ఆసిఫాబాద్: జిల్లాలోని రైతులు ఆయిల్‌పాం సాగుకు రైతులు ముందుకురావాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, ఆసిఫాబాద్, జైనూర్ ఏఎంసీ చైర్‌పర్సన్లు ఇరుకుల్ల మంగ, విశ్వనాథ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నదీం, జిల్లా వ్యవసాయాధికారి వెంకటితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందని, నీటి సౌకర్యం కలిగిన రైతులు సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మొదటి నాలుగేళ్లు అంతర పంటలను సైతం సాగు చేసుకోవచ్చన్నారు. చీడ పురుగులు, పశువులు, కోతుల బెడద ఉండదని, రైతులు అధిక లాభాలు అర్జించవచ్చని పేర్కొన్నారు. పత్తి, వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, కూరగాయల పంటలు పండించాలని సూచించారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నామని, అదే ఆయిల్‌పాం సాగు పెరిగితే ఇక్కడే వంట నూనెలు చౌకగా దొరుకుతాయన్నారు. ప్రతీ రైతు కుటుంబానికి సరిపడా పంటలు, కూరగాయలు పండించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతులను శాలువాలతో సన్మానించారు. సమావేశంలో రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


