చుక్..చుక్ బండి ఆగింది..
సిర్పూర్(టి): ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం.. రాత్రి.. సమయం ఏదైనా కూ.. చుక్ చుక్.. అంటూ రైలు కూత వినబడేది. సిర్పూర్(టి) స్టేషన్ పరిసర ప్రాంత ప్రజలు రైలు కూత ఆధారంగానే ఏ రైలు వస్తుందో కూడా చెప్పేవారు. కానీ, కొన్నిరోజులుగా ఈ కూత వినిపించడం లేదు. మూడోలైన్ నిర్మాణ పనులతో రైళ్లు రద్దు చేశారు. దీంతో రైల్వే స్టేషన్ కళ తప్పింది. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు హైదరాబాద్, నాగ్‌పూర్, విజయవాడ, చైన్నె వరకు రాకపోకలు సాగించేవారు. మూడోలైన్ పనుల కారణంగా ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ఫలితంగా ప్రయాణికులు లేక స్టేషన్ నిరుపయోగంగా ఉంటోంది. వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.
నగరాలకు రైలు సౌకర్యం..
సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి నియోజకవర్గ ప్రజలు ప్రధాన నగరాలకు వెళ్లేందుకు రైళ్ల సౌకర్యం ఉండేది. గతంలో విజయవాడ, చైన్నె, నాగ్‌పూర్, ఢిల్లీకి వెళ్లేందుకు జనతా ఎక్స్‌ప్రెస్ ఉండేది. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్ ప్యాసింగర్‌లో హైదరాబాద్, నాగ్‌పూర్ పట్టణాలకు రాకపోకలు సాగించేవారు. మొదట జనతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయగా.. కోవిడ్ ప్రారంభ సమయంలో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. కోవిడ్ ప్రభావం ముగిసినా మూడోలైన్ నిర్మాణ పనులతో పునఃప్రారంభానికి నోచుకోలేదు. సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల ప్రజలు కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల పట్టణాలకు వెళ్లి ట్రైన్లు ఎక్కుతున్నారు.
వారం రోజులుగా నిర్మానుష్యం..
సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ నడిచే రామగిరి, సింగరేణి, పుష్పుల్ ప్యాసింజరు రైళ్లను అధికారులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజూలుగా రైళ్లు లేకపోవడంతో సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. ఘనమైన చరిత్ర కలిగిన స్టేషన్ నేడు నిరుపయోగంగా ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్లు వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు.
రావడం మానేశారు..
సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడేది. రైళ్ల రద్దుతో స్టేషన్‌కు ప్రయాణికులు రావడం మానేశారు. ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు.
– నులిగొండ మహేశ్, సిర్పూర్(టి)
రైళ్లు పునరుద్ధరించాలి
సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి గతంలో కొనసాగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించాలి. అంతరాయం లేకుండా ప్యాసింజర్ రైళ్లను కొనసాగించాలి. స్టేషన్‌లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలి.
– ఎల్ములే కిశోర్, నవేగాం, మం.సిర్పూర్(టి)
చుక్..చుక్ బండి ఆగింది..


