ఫోన్ ట్యాపింగ్ నెపంతో కక్ష సాధింపు
ఆసిఫాబాద్‌అర్బన్: ఫోన్ ట్యాపింగ్ నెపంతో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని జిల్లా మున్సిపల్ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో సిట్ నోటీసులను బహిరంగంగా దహనం చేశారు. రహదారిపై నల్ల జెండాలతో బైఠాయించి నిరసన తెలిపారు. మొదట బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేడ్కర్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. బీఆర్‌ఎస్ కార్యాలయానికి చేరుకుని నల్ల జెండా ఆవిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ సాధకుడిపై జరుగుతున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని వారు పేర్కొన్నారు.


