ప్రచారంపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రచారంపై ఫోకస్‌

Feb 1 2026 3:13 AM | Updated on Feb 1 2026 3:13 AM

ప్రచారంపై ఫోకస్‌

ప్రచారంపై ఫోకస్‌

● గెలుపుకోసం వ్యూహాలకు పదును ● రెబల్స్‌కు బుజ్జగింపులు ● ప్రధాన పార్టీలకు తలనొప్పి

రంగంలోకి ప్రధాన పార్టీల నాయకులు

ఆసిఫాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఎట్టకేలకు నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఇప్పటికే సోషల్‌ మీడియా, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించారు. గెలుపే లక్ష్యంగా తమ మద్దతుదారులతో కలిసి వ్యూహాలకు పదును పెడుతున్నారు. అన్ని వార్డుల్లో గెలుపుకోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో ఇప్పటికే ఓ అభ్యర్థి సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేపట్టారు. వివిధ హామీలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలకు మున్సిపల్‌ ఎన్నికలు సవాల్‌గా మారాయి.

ఎన్నికలు రసవత్తరం

మున్సిపల్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలసి రావడంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్యే ప్రధాన పోటీ ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ బీసీ జనరల్‌, కాగజ్‌నగర్‌ బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో ఆయా సామాజిక వర్గాల వారు కౌన్సిలర్లుగా బరిలో నిలిచారు. రిజర్వేషన్లు అనుకూలించిన అభ్యర్థులు తొలుత కౌన్సిలర్‌గా గెలిస్తే, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఆశిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో తొలిసారి జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థులు తమ గెలుపుకోసం ఖర్చుకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేస్తున్నారు.

3న తుది జాబితా

గతనెల 28 నుండి 30 వరకు జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు మందకొడిగా దాఖలైన నామినేషన్లు, రెండోరోజు, చివరి రోజు అధికంగా దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీ పడ్డారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 166 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో శనివారం ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రారంభించారు. ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ పూర్తవడంతో తుది జాబితా వెలువడనుంది.

గెలుపు దిశగా...

మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్మన్‌ పీఠాలను కై వసం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అధినేతలు జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీల జిల్లా ఇన్‌చార్జీలు జిల్లా కేంద్రంలో మకాం వేసి అభ్యర్థులను సమన్వయం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా ప్రధాన పార్టీలకు రెబల్స్‌తో తలనొప్పిగా మారింది. అధికార కాంగ్రెస్‌ లో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించక పోవడంతో పోటీ చేస్తున్న వారిలో ఆందోళన నెలకొంది. టికెట్లు దక్కని వారు స్వతంత్రులు గా పోటీలో ఉండగా కొంతమంది పార్టీ ని వీడి ప్రతి పక్ష పార్టీ కండువా వేసుకుంటున్నారు. దీంతో ఆయా వార్డుల్లో సొంత పార్టీ రెబల్స్‌ తలనొప్పిగా మారింది. రెబల్స్‌ ను పోటీ నుంచి తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 2 రోజు ల గడువు ఉంది. ప్రచార పర్వం మొదలుకావడంతో మున్సిపాలిటీల్లో మైకుల మోత మోగనుంది.

అభ్యర్థులను ఖరారు చేయని పార్టీలు

కాగజ్‌నగర్‌టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం మూడు రోజులు కొనసాగింది. ఇక ప్రధాన పార్టీలు అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సి ఉంది. ఆసిఫాబాద్‌ మున్సిపాల్టీలో 20 వార్డులకు 10 నామినేషన్లు దాఖలు కాగా కాంగ్రెస్‌ 27, బీఆర్‌ఎస్‌ 23, బీజేపీ 17, బీఎస్పీ 3, సీపీఐ 3, సీపీఎం 1, స్వతంత్రులు 31, జనసేన 5, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 30 వార్డులకు 230 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ 48, కాంగ్రెస్‌ 56, బీఆర్‌ఎస్‌ 73, బీఎస్పీ 19, జనసేన 4, సీపీఐ(ఎం)2, ఏఐఎంఐఎం 4, ఐయూఎంఎల్‌ 3, ఐపీబీపీ1, ఇండిపెండెంట్‌ 20 నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని వార్డుల్లో తీవ్రమైన పోటీ కనిపిస్తుండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ రోజే బీఫాంలను అభ్యర్థులకు అందించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement