
వినతులు స్వీకరించి.. భరోసా కల్పించి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ తన పట్టా భూమిని సేకరించిందని, అందులోని 324 నీలగిరి చెట్లకు నష్టపరిహారం ఇప్పించాలని రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన పేట తిరుపతి కోరాడు. చింతలమానెపల్లి మండలం రణవెల్లి గ్రామంలోని లావుణి పట్టా భూమిని ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, న్యాయం చేయాలని సిర్పూర్–టి మండలం డోర్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం రుషి ఫిర్యాదు చేశాడు. పదో తరగతి పూర్తి చేసిన తనకు రేషన్ డీలర్‌గా అవకాశం ఇవ్వాలని చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామానికి చెందిన సునీత కోరింది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమికి పట్టా ఇవ్వాలని పెంచికల్‌పేట్ మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి పెద్ద పెంటయ్య అర్జీ సమర్పించాడు. తన కుమారుడికి ఏదైనా గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి సీటు ఇవ్వాలని సిర్పూర్(టి) డోర్‌పల్లి గ్రామానికి చెందిన జాడి విఠల్ కోరాడు. సిర్పూర్(టి) మండల కేంద్రంలో సాగు చేసుకుంటున్న భూమికి పట్టా మంజూరు చేయాలని దడ్డి బుజ్జి విన్నవించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ప్రజావాణి