●‘చాంబర్’ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల
ఖమ్మంగాంధీచౌక్: రైతులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని.. అప్పుడే అందరి అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసా య, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన చాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కితే.. అన్ని వర్గాలతో పాటు వ్యాపారులు అభివృద్ధి చెందుతారన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఖమ్మంలో 100 ఎకరాల్లో వ్యవసాయ మార్కెట్ నిర్మించాలని భావించగా, కొత్త స్థలానికి బదులు ఇష్టం లేకున్నా ప్రస్తుత మార్కెట్ ఆవరణలోనే నిర్మించాల్సి వస్తోందన్నారు. వ్యాపారులు రాజకీయాలకు అతీతంగా ఉండాలని, చాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గం ఏకగ్రీవం కావాలని ఆకాంక్షించారు. వ్యాపార ప్రతినిధులు విన్నవించిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని మంత్రి తుమ్మల తెలిపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సోమా నరసింహారావుతో పాటు బత్తిని నరసింహారావు, బాదే రమేష్, తల్లాడ రమేష్, కొప్పు నరేష్‌కుమార్, చిన్ని కృష్ణారావు, గుర్రం ఉమామహేశ్వరరావు, మెంతుల శ్రీశైలం, ఖమ్మం మార్కెట్, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, ఖాదర్‌బాబా, నాయకులు సాధు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, దీపక్ చౌదరి పాల్గొన్నారు.


