● ప్రతీ కుటుంబం బాగుపడాలన్నదే లక్ష్యం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● నాచారం రహదారి నిర్మాణానికి శంకుస్థాపన, ఆలయంలో పూజలు
వైరా అభివృద్ధికి
ప్రతిపాదనలు
వైరా: వైరా అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన కలెక్టర్ దివాకర, ఎమ్మెల్యే రాందాస్, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోనే మోడల్‌గా వైరా బస్టాండ్‌ను తీర్చిదిద్దడమే కాక రింగ్ రోడ్డు అభివృద్ధి, వైరా క్రాస్ నుంచి తల్లాడ మండలం వరకు 5 కి.మీ. రహదారి నిర్మాణం, రిజర్వాయర్ ప్రారంభంలో చిల్డ్రన్ పార్క్, లాన్, పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే, ఆనకట్టకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ శాఖకు అప్పగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. ఇంకా వైరా ఐఎంఎల్ మద్యం డిపో నుంచి లక్ష్మీపురం బీ.వీ మల్లు రోడ్డు వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, తనికెళ్ల విజయ కళాశాల నుంచి శాంతినగర్ వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, పల్లిపాడు సెంటర్లో సర్కిల్, స్టేజీ పినపాక హై లెవల్ వంతెన విస్తరణ ప్రతిపాదనలతో పాటు ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ భవనాల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల శంకుస్థాపనకు ఏర్పాటు చేయాలని సూచించారు. వైరా ఎన్నెస్సీ క్వార్టర్ల స్థానంలో అభివృద్ధి పనులకు అవసరమైన భూమిని సేకరించాలని తెలిపారు. అడిగి తెలుసుకున్నారు. పోలీసు కమిషనర్ సునీత్దత్, ఆర్అండ్బీ ఎస్ఈ యుగేందర్, డీఈ రమేష్, జేఈ వసుంధర, తహసీల్దార్ సురేష్ పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో బీఎల్ఏలే కీలకం
కాంగ్రెస్ అభివృద్ధిలో కీలకమైన బీఎల్ఏలు ప్రభు త్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. వైరాలో బీఎల్ఏలతో సమావేశమైన ఆయన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదులో కీలకంగా వ్యవహరించాలని తెలిపారు. ఎమ్మెల్యే రాందాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నేతలు బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, శీలం చంద్రశేఖర్‌రెడ్డి, వీరంశెట్టి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
ఏన్కూరు: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం బాగుండాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని.. అందుకోసం సంక్షేమ పథకాలనను అమలుచేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఏన్కూరు నుంచి నాచారం శ్రీ అద్భుత వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు రూ.43 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులను ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆలయానికి భవిష్యత్‌లో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రవాణా సౌకర్యార్థం బీటీ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాచారం నుంచి జూలూరుపాడు మీదుగా తల్లాడ – భద్రాచలం ప్రధాన రహదారిని కలిపేలా గన్నవరం, నాచారం భద్రుతండా ప్రాంతాలకు ఉపయోగపడే మరో బీటీ రహదారిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తొలుత డిప్యూటీ సీఎం భట్టికి మేళతాళాలు, డప్పు వాయిద్యాల, కొమ్మునృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు. ఆతర్వాత నాచారం దేవస్థానంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌తో కలిసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ సునీల్‌దత్, సుడా చైర్మన్ పువాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరావు, స్వర్ణ నరేందర్ పాల్గొన్నారు.


