ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా శ్రీ అలివేలు మంగ అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో అలంకరించగా వివిధ ప్రాంతాల భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, అర్చక, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు, రేపు మంత్రి
పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమ, మంగళవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో రెండో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. ఆతర్వాత ఏదులాపురం 22వ వార్డు టీఎన్జీవోస్ కాలనీలో గిరిజన సంక్షేమ శాఖ బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక మంగళవారం ఉదయం ఎర్రుపాలెం మండలం జమలాపురం ఆలయం, తక్కెళ్లపాడులోని శ్రీ లలితా రాజరాజేశ్వరి ఆలయంలో పూజలు చేయనున్న మంత్రి, మధ్యాహ్నం భద్రాద్రి జిల్లా ఇల్లెందు జేకే కాలనీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మినీ స్టేడియం, గోవింద్ సెంటర్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించాక తిలక్ నగర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆ తర్వాత ఇల్లెందు మండలం మేడికుంట వద్ద హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి, సాయంత్రం ఫారెస్ట్ గ్రౌండ్లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో పాల్గొంటారని క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
రేక్ పాయింట్‌కు 1,321 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు ఆదివారం క్రిబ్కో కంపెనీకి చెందిన 1,321.20 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 521.20 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 500 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 200 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మరో 100 మె.టన్నుల యూరియాను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.
గోదావరి నదికి హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలో భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో దుర్గాష్టమి సందర్భంగా ఆదివారం గోదావరి మాతకు భక్తిశ్రద్ధలతో హారతి నిర్వహించారు. పురోహితులు, భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు.
నాణ్యమైన బొగ్గు
సరఫరా చేయాలి
రుద్రంపూర్: వినియోగదారులకు నాణ్యమైన సరఫరా చేసేందుకు కార్మికులు, అధికారులు ఐక్యంగా కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ సూచించారు. ఆదివారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఆర్‌సీహెచ్‌పీ)ను సందర్శించారు. బొగ్గు నిల్వలు, క్రషింగ్, లోడింగ్, కన్వేయర్ బెల్ట్ పనితీరు, బొగ్గు రవాణా వివరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్పత్తితోపాటు కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. జీఎం వెంకటరమణ, ఇతర అధికారులు గోవిందరావు, ముక్కపాటి వెంకటేశ్వర్లు, వి.రామకృష్ణ, లింగా, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.


