ఎల్‌నినోను ఎదుర్కొనేలా కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను ఎదుర్కొనేలా కార్యాచరణ

Oct 19 2026 12:49 AM | Updated on Oct 19 2026 12:49 AM

● అందుబాటులో ఉన్న నీరు తాగు అవసరాలకే ప్రాధాన్యత ● విద్యుత్‌ అంతరాయాలు, లోఓల్టేజీ రాకుండా ముందస్తు చర్యలు ● ఉమ్మడి జిల్లా సమీక్షలో ప్రత్యేక అధికారి అనుదీప్‌

● అందుబాటులో ఉన్న నీరు తాగు అవసరాలకే ప్రాధాన్యత ● విద్యుత్‌ అంతరాయాలు, లోఓల్టేజీ రాకుండా ముందస్తు చర్యలు ● ఉమ్మడి జిల్లా సమీక్షలో ప్రత్యేక అధికారి అనుదీప్‌

ఖమ్మం సహకారనగర్‌: సూపర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా రానున్న ఎనిమిది నెలల కాలానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్‌ దురిశెట్టి ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన ఖమ్మం, భద్రాద్రి అదనపు కలెక్టర్లు పి.శ్రీనివాసరెడ్డి, డి.వేణుగోపాల్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అనుదీప్‌ మాట్లాడుతూ గత ఏడాది వర్షపాతం, ఈ ఏడాది వర్షపాతాన్ని మండలాల వారీగా పరీశీలించి లోటు ఉన్న మండలాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాక పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు.

తగ్గుతున్న భూగర్భ జలాలు

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో 5 మీటర్లు, ఎర్రుపాలెం మండలంలో 6.5 మీటర్లు, ఏన్కూరు, సత్తుపల్లి మండలాల్లో 5 మీటర్లకు పైగా లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయని అనుదీప్‌ తెలిపారు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట, కొత్తగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో 10 మీటర్లకు పైగా భూగర్భ జలమట్టం తగ్గిందని చెప్పారు. ఇకపై భూగర్భ జలాలను పరిరక్షించేందుకు అనధికారికంగా బోర్లు వేయడాన్ని కట్టడి చేయడమే కాక వ్యవసాయ బోర్లకు ఆటో స్టార్టర్లు తొలగించాలని సూచించారు. అంతేకాక వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓలు) రైతు వేదికల వద్ద గ్రామాల వారీగా మూడు ఫేజ్‌ల విద్యుత్‌ సరఫరా సమయాలను ముందుగానే ప్రకటించాలన్నారు. తాగునీటి అవసరాల కోసం మినహా కొత్త బోర్లకు అనుమతులు ఇవ్వొద్దని, బోర్లు వేసే వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో తగ్గనందున... యాసంగిలోనైనా వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం సాగులో పంటలకు ఒకటి, రెండు తడులు అవసరమైన చోట సాధ్యమైన చోట నీరు విడుదల చేయాలన్నారు.

అవసరమైతే ‘రేషన్‌’ విధానం

భద్రాద్రి జిల్లాలోని వర్షాధార చెరువుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని అనుదీప్‌ స్పష్టం చేశారు. చెరువుల్లో నీరు నిల్వ ఉంచడం వల్ల భూగర్భ జలమట్టం మెరుగుపడుతుందని తెలిపారు. రానున్న ఎనిమిది నెలల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. పాలేరు, వైరా రిజర్వాయర్ల నుంచి తాగునీటి అవసరాల కోసం ఎప్పుడు, ఎంత నీరు విడుదల చేయాలో షెడ్యూల్‌ రూపొందించాలన్నారు. ఐటీసీ, హెచ్‌డబ్ల్యూపీ నీటి సరఫరా పరిస్థితులను సమీక్షించి, అవసరమైతే రేషనింగ్‌ విధానాన్ని అమలు చేస్తూ.. తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనధికారిక విద్యుత్‌ కనెక్షన్ల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ల పడుతున్నందున కట్టడి చేయాలని, ఫీడర్లలో లో ఓల్టేజీ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక పశువులకు అవసరమైన నీరు, పశుగ్రాసం అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, గ్రామాల్లో పశువుల నీటి తొట్ల నిర్మాణానికి వీబీజీ రాంజీ పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement