ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించగా పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డీఎల్‌ఎస్‌ఏ ద్వారా
ఉచిత న్యాయసాయం
ఖమ్మంలీగల్: అవసరమైన వారికి ఉచిత న్యాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మంలోని అంధుల, బధిరుల పాఠశాలలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల చట్టం, న్యాయ సేవాధికార సంస్థల చట్టంలోని ముఖ్యాంశాలు, దివ్యాంగులకు అందుబాటులో ఉండే సదుపాయాలు, వివక్ష లేని విద్య, ఉపాధి అవకాశాలను వివరించారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైతే సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఏఈఓపై సస్పెన్షన్ వేటు
● యూరియా పేరిట నగదు వసూళ్లు
తిరుమలాయపాలెం: యూరియా పేరిట రైతులను నమ్మించి డబ్బులు తీసుకుని అక్రమాలకు పాల్పడిన మండలంలోని బచ్చోడు ఏఈఓ కల్యాణ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. యూరియా కొరతను ఆసరాగా చేసుకున్న ఆయన మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులకు యూరియా ఇప్పిస్తానంటూ నగదు వసూలు చేశాడు. ఆపై వారికి యూరియా ఇప్పించకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో రైతులు ఏఓ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇటీవల కూసుమంచి ఏడీఏ రాజేష్‌కుమార్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక మేరకు కల్యాణ్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కళ్యాణ్ మహబూబాబాద్ జిల్లాలో పనిచేసిన సమయాన కూడా పలు ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు.


