15స్థానాలకు బరిలో 39మంది జిల్లా కమిటీ ఎన్నికకు వచ్చేనెల 4న పోలింగ్
సభ్యులంతా ఓటు వేయాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్‌సీఎస్) జిల్లా కమిటీ ఎన్నికల ఏర్పాట్లు తుదిశకు చేరాయి. వచ్చేనెల 4న ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో పోలింగ్ జరగనుండగా, 15పదవులకు 39మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈమేరకు 2,430 మంది ఓటర్లు బ్యాలెట్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
2010లో బ్రాంచ్ ఏర్పాటు
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఖమ్మం జిల్లా బ్రాంచ్ 2010 ఏడాదిలో 656 మంది సభ్యులతో ఏర్పాటైంది. ప్రతీ మూడేళ్లకోసారి ఎన్నిక ద్వారా జిల్లా మేనేజింగ్ కమిటీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఈ కమిటీ గడువు మార్చి 26తో ముగియగా, ఈసారి పలువురు పోటీ పడుతుండడంతో ఎన్నికలు జరగనున్నాయి. రెడ్‌క్రాస్ సొసైటీ సేవా ద్వారా రక్తదాన శిబిరాలు, విపత్తుల వేళ బాధితులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సొసైటీ ప్రెసిడెంట్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు.
మొత్తం ఓటర్లు 2,430 మంది
మూడేళ్ల కాలపరిమితితో కమిటీని ఎన్నుకునేందుకు జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ దివాకర ఆదేశాలతో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులను సభ్యులుగా చేర్చగా.. యువత, ఇతర వర్గాలు ఆన్‌లైన్‌లో సభ్యత్వం తీసుకున్నాయి. ఈ డ్రైవ్‌లో లైఫ్ మెంబర్‌షిప్, లైఫ్ అసోసియేట్ మెంబర్‌షిప్ 1,410 మంది తీసుకోగా, గతంలో సభ్యత్వం కలిగిన వారితో కలిపి మొత్తం 2,430 మంది ఓటర్లు అయ్యారు. వీరు మాత్రమే పోటీ చేయడానికి, ఓటు వేయడానికి అర్హులు కాగా, యాన్యువల్, ఇతర మెంబర్‌షిప్ తీసుకున్న వారికి ఆ అర్హత ఉండదు.
వచ్చేనెల 4న పోలింగ్
రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నిక వచ్చేనెల 4న ఉదయం 8నుంచి సాయంత్రం 3గంటల వరకు టీటీడీసీ భవనంలో నిర్వహించి, ఆతర్వాత ఓట్లు లెక్కిస్తారు. కమిటీలోని 15 స్థానాల కోసం పలువురు నామినేషన్లు దాఖలు చేయగా, ఉపసంహరణ గడువు శనివారంతో ముగియడంతో 39 మంది బరిలో మిగిలారు. కాగా, ఎన్నిక ప్రక్రియ బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జరుగుతుంది. గుర్తులు, ఫొటోలు కాకుండా అక్షర క్రమంలో ఉండే అభ్యర్థుల పేర్ల వద్ద ప్రతీ ఓటరు గరిష్టంగా 15 మందికి టిక్ పెట్టడం ద్వారా ఓటు వేయవచ్చు. కనీసం ఒకరికి, అత్యధికంగా 15 మందికి టిక్ పెట్టే అవకాశం ఉండగా.... అత్యధిక ఓట్లు(టిక్‌లు) వచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. అయితే, 15 మంది తర్వాత మరొకరికి కూడా సమానమైన టిక్కులు వస్తే డ్రా తీస్తారు. మొత్తం 15మందితో మేనేజింగ్ కమిటీ ఎన్నికయ్యాక, అందులో నుంచి చైర్మన్, వైస్‌చైర్మన్, ట్రెజరర్, స్టేట్ కమిటీ మెంబర్లను ఎన్నుకుంటారు.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఐఆర్‌సీఎస్ జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ దివాకర ఆదేశాలతో రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం. సభ్యత్వం కలిగిన అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికలు టీటీడీసీలో వచ్చేనెల 4న జరగనున్నాయి.
– ఏ.శ్రీనివాస్, సీపీఓ, రెడ్‌క్రాస్ ఎన్నికల అధికారి


