రూ.3లక్షల విలువైన వైకుంఠరథం, ఫ్రీజర్‌ వితరణ | - | Sakshi
Sakshi News home page

రూ.3లక్షల విలువైన వైకుంఠరథం, ఫ్రీజర్‌ వితరణ

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

కామేపల్లి: కామేపల్లికి చెందిన అవధూతేంద్ర భక్తమండలి అధ్యక్షుడు గొట్టుపర్తి శివాజీ కుటుంబం తమ ధాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు. గ్రామ అవసరాల కోసం సుమారు రూ.3 లక్షల విలువైన వైకుంఠ రథం, శీతల శవపేటిక గురువారం జీపీ బాధ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు గొట్టుపర్తి సీతారామయ్య–రంగమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీటిని అందించినట్లు చెప్పగా, సర్పంచ్‌ అజ్మీరా బుల్లి, గ్రామస్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అజ్మీరా హరినాయక్‌, భూక్యా సీతారాములు, తిరుపతిరావు, పాప్యానాయక్‌, కేశగాని నాగయ్య, బండి నరసింహారావు, కన్నమాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అనాథ మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

ఖమ్మం మామిళ్లగూడెం: నర్సరీ నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదివే తండ్రి లేని అనాథ మైనారిటీ పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందించనున్నట్లు హైదరాబాద్‌లోని జకాత్‌ చారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అర్హులైన విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థి, తల్లి ఆధార్‌ కార్డులు, రేషన్‌కార్డు జిరాక్స్‌లు, పాస్‌ ఫొటో, తండ్రి మరణ ధ్రువపత్రం, తల్లి బ్యాంక్‌ అకౌంట్‌ జిరాక్స్‌లు, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ ఒరిజినల్‌, ప్రైవేట్‌ స్కూల్‌లో చదివే వారైతే ఫీజు రశీదు, విద్యార్థి పుట్టిన తేదీ ధ్రవపత్రాలను దరఖాస్తు జత చేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు 98665 56876 నంబర్‌లో సంప్రదించాలని వారు ఓ ప్రకటనలో సూచించారు.

తాలిపేరుకు

పెరుగుతున్న వరద

చర్ల: ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రెండు రోజులుగా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్‌లోకి వరదనీరు చేరుతోంది. గురువారం నీటిమట్టం 70.32 మీటర్లకు చేరుకుంది. వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లకు చేరనుంది. కాగా నీటిమట్టం 72 – 73 మీటర్లకు చేరితే పొలాలకు సాగునీరు విడుదల చేస్తామని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

దేవస్థానం సిబ్బంది

తిరిగి యథాస్థానానికి..

భద్రాచలం: యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బదిలీ సిబ్బంది తిరిగి యథాస్థానానికి వచ్చేలా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. 2025 దేవాదాయ శాఖ చట్టం ప్రకారం దేవస్థానం పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి అవసరాల దృష్ట్యా యాదగిరిగుట్ట దేవస్థానానికి ఇతర దేవాలయాల నుంచి బదిలీపై వచ్చిన సిబ్బందిని తిరిగి పాత సంస్థలకు పంపాలని నిర్ణయించారు. దీంతో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం నుంచి యాదగిరి గుట్టకు వెళ్లిన సూపరింటెండెంట్‌ నిరంజన్‌, రికార్డు అసిస్టెంట్‌ కిషోర్‌ తిరిగి భద్రాచలం దేవస్థానానికి రానున్నారు. యాదగిరి గుట్ట నుంచి భద్రాచలం వచ్చిన అరుణ్‌ తిరిగి అక్కడికే వెళ్లనున్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’లో

కారేపల్లి కేజీబీవీ ఫస్ట్‌!

కారేపల్లి: ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్‌) ద్వారా హాజరు నమోదులో కారేపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, కళాశాల విద్యార్థులు అగ్రస్థానాన నిలిచారు. ఈమేరకు 129 మందితో 90 శాతం హాజరు నమోదు కాగా, గురువారం కేజీబీవీలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌ఓ ఝాన్సీసౌజన్య ప్రశంసాపత్రాలను అందజేశారు. ఇందుకు కృషి చేసిన 14మంది ఉపాధ్యాయునులకు కూడా ప్రశంసాపత్రాలు ఇచ్చి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement