ప్రత్యక్షంగా చూసే అవకాశం
సాంకేతికతపై అవగాహన
● ‘ఆశీర్వాద సభ’ప్రాంగణంలో ఏర్పాటు ● పంట ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాల ప్రదర్శన ● స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించిన అన్నదాతలు
చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రైతు ఆశీర్వాద సభ జరగనున్న ప్రాంగణంలో గురువారం మెగా రైతు మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖలకు సంబంధించి 150 స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. సేంద్రియ వ్యవసాయం, బిందు, తుంపర్ల సేద్యం, యాంత్రీకరణ, ఆధునిక, సాంకేతిక సాగు విధానాలపై శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించారు. విత్తనాలు, సేంద్రియ ఎరువులు, నీటి పొదుపుపై ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే, మల్బరీ, ఆయిల్‌పామ్ సాగు, పంటలపై పురుగు మందుల పిచికారీ, నాటు వేసే యంత్రాలే కాక అధిక పాల దిగుబడిని ఇచ్చే దేశీయ పశువులు, గేదెలను ప్రదర్శించగా జిల్లా నలుమూలల నుంచి రైతులు ఆసక్తిగా పరిశీలించారు. అంతేకాక వాటి వివరాలు తెలుసుకుంటూ సాగులో ఎలా ఉపయోగపడతాయో ఆరాతీశారు. కాగా, రైతు మేళాకు హాజరైన అన్నదాతలకు అధికారులు అల్పాహారం, భోజన వసతి కల్పించారు.
రైతు మేళా బాగుంది. ఇక్కడ విత్తనాలు, సేంద్రియ ఎరువులు, పరికరాలపైనే కాక సాగు విధానాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. రైతుల పని సులువుగా మార్చే అనేక యంత్రాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది.
– తిరుపతి ప్రసాద్, రైతు, మత్కేపల్లి
పంటల సాగులో సాంకేతికతపై అవగాహన కలిగింది. అధిక దిగుబడి సాధించే మేలు రకం విత్తనాలు, సహజ సేంద్రియ ఎరువుల వాడకంతో లాభాలు, ఆధునిక యంత్రాలను చూశాం. లాభసాటి వ్యవసాయంపై అవగాహన కలిగింది.
– పరిటాల నాగేశ్వరరావు, రైతు, మల్లన్నపాలెం


