అందుబాటులోకి ఫ్యాక్టరీలు
ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్ తోటల వివరాలు
రాష్ట్ర సాగులో 47శాతం ఇక్కడే..
ప్రభుత్వ ప్రోత్సాహంతో
ముందుకొస్తున్న రైతులు
త్వరలోనే ప్రారంభం కానున్న
మరో రెండు ఫ్యాక్టరీలు
సుదీర్ఘకాలంగా ఆయిల్‌పామ్ సాగులో ఉమ్మడి ఖమ్మం జిల్లా రికార్డులు సృష్టిస్తోంది. ఇక్కడ 1992 నుంచి ఆయిల్‌ఫెడ్, గోద్రేజ్ అగ్రో వెట్ సంస్థలు రైతులతో పంట సాగు చేయిస్తున్నాయి. ఇక్కడ సాగుకు అనువైన సారవంతమైన నేలలు ఉండ డం, ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రచారంతో రైతులు దృష్టి సారించారు. మొక్కల సరఫరా కోసం నర్సరీలు ఏర్పాటు చేయడమేకాక, డ్రిప్ ఇరిగేషన్, యాజమాన్యం, అంతరపంటల కోసం ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.46,250ల రాయితీ ఇస్తోంది. అంతేకాక రైతుల నుంచి ఆయిల్‌పామ్ గెలలు కొనుగోలు చేశాక మూడు రోజుల్లోనే ఖాతాల్లో నగదు జమ అవుతుంది. గతంలో ఆయిల్‌పామ్ టన్ను ధర రూ.12,534 ఉండగా.. ప్రస్తుతం రూ.23,852కు చేరింది. ఇక దేశంలోనే రాష్ట్రంలో ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్) 20.01 శాతం సాధించారు.
ఉమ్మడి జిల్లాలోని 1,34,698 ఎకరాల్లో ప్రస్తుతం ఆయిల్‌పామ్ తోటలు ఉన్నాయి. ఇక 2026–27లో రెండు జిల్లాలకు 14,500 ఎకరాల చొప్పున మరో 29 వేల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే 9,468 ఎకరాలకు గాను రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో 56 మంది రైతులు 203 ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 178 మంది రైతులు 668 ఎకరాల్లో ఇప్పటికే మొక్కలు నాటడం కూడా పూర్తయింది.
దేశీయంగా అవసరమైన పామాయిల్ కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా 15.70 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులో ఉంది. కానీ దేశం స్వయం సమృద్ధి సాధించాలంటే 70 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు అవసరం. ఈ నేపథ్యాన ఐదేళ్లుగా జాతీయ నూనెగింజల పథకం కింద ఆయిల్‌పామ్ సాగు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో 71,030 మంది రైతులు 2.44 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు వేయగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ముందంజలో నిలుస్తోంది.
ఆయిల్‌పామ్ సాగయ్యే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు అవసరం. దీంతో సాగు పెరుగుతున్న నేపథ్యాన ప్రభుత్వం వీటి ఏర్పాటుపై దృష్టి సారించింది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. నూతనంగా వేంసూరు మండలం కల్లూరుగూడెం, కొణిజర్ల మండలం అంజనాపురంలో సిద్ధమవుతున్న ఫ్యాక్టరీలు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయి. ఈ మిల్లుల సామర్థ్యం గంటకు 15 టన్నులు కాగా.. దశల వారీగా గంటకు 60 టన్నులకు
పెంచనున్నారు.
జిల్లా రైతులు ఎకరాలు
ఖమ్మం 11,240 45,892
భద్రాద్రి కొత్తగూడెం 22,040 88,806
రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సాగు


