ఎమ్మెల్యే పరిశీలన
● డిప్యూటీ సీఎం భట్టి విద్యాభ్యాసం ఇక్కడే.. ● భవనం అభివృద్ధి చేసి... తిరిగి పాఠశాల నిర్వహణకు ప్రణాళిక
వైరా/వైరారూరల్: ఆ భవనాన్ని 1955–56 సంవత్సరంలో నిర్మించారు. మధిర తాలుకా పరిధిలో వైరా బ్లాక్ డెవవలప్‌మెంట్ కార్యాలయం ఇక్కడ కొనసాగింది. గ్రామీణ పరిపాలన అంత కూడా ఈ భవనం నుండే సాగింది. మండల పరిషత్‌లు మనుగడలోకి వచ్చాక 1960లో ఈ భవనాన్ని ప్రాథమిక పాఠశాలగా మార్చారు. ఎత్తయిన ప్రాంతంలో నిర్మించిన ఈ భవనానికి గుట్టబడి అని పేరు రాగా.. స్నానాల లక్ష్మీపురానికి చెందిన ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాలినడకన వచ్చి ఈ స్కూల్‌లోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు.
అభివృద్ధిపై సూచనలు
కొన్నేళ్ల క్రితం పాఠశాలను మండల వనరుల కేంద్రంలోకి మార్చి, ఇక్కడ మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటుచేశారు. ఆపై మండల పరిషత్‌కు కొత్త భవనం నిర్మించడంతో అందులోకి తరలించి, ఇక్కడ ఈజీఎస్ కార్యాలయం కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కలిసి చదువుకున్న ప్రస్తుత సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులతో చర్చించే క్రమాన గుట్టబడి ప్రస్తావన వచ్చింది. దీంతో భవనానికి అవసరమైన మరమ్మతులు చేయించి ఒకటి, రెండు తరగతులైనా నిర్వహించాలని ఆదేశించారు. అదీ కుదరకపోతే విద్యాశాఖ అవసరాలకు వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఇందుకోసం ఈజీఎస్ కార్యాలయాన్ని అవసరమైతే పక్కనే ఉన్న మండల పరిషత్ కార్యాలయంలోకి లేదా మరో భవనంలోకి మార్చాలని సూచించారు.
గుట్టబడి భవనాన్ని అభివృద్ధి చేయాలన్న డిప్యూటీ సీఎం భట్టి సూచనలతో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మంగళవారం పరిశీలించారు. భవనం అభివృద్ధి, రహదారి వెడల్పు, సెంట్రల్ లైటింగ్, ప్రహరీ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్ సీహెచ్.సురేష్, ఎంపీడీఓ సక్రియా, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఆయన వెంట సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, ముళ్లపాటి సీతారాములు, దార్నా రాజశేఖర్, డాక్టర్ శ్యాంబాబు తదితరులు ఉన్నారు.


