● బాస్కెట్‌బాల్ జట్టు గెలుపులో కీలకంగా బాలిక ● అదే సమయాన ఆమె తండ్రి గుండెపోటుతో మృతి
కామేపల్లి: ఓ బాలిక క్రీడలపై ఆసక్తి పెంచుకోగా, ఆమె తండ్రి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాడు. బాలిక కీలకమైన పోటీల్లో పాల్గొనే సమయాన ఆయన గుండెపోటుతో మృతి చెందడంతో జట్టు విజయంలో కుమార్తె పాత్రను కళ్లారా చూడలేకపోయిన ఘటన ఇది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. ఖమ్మం టేకులపల్లికి చెందిన ఈదర మధుసూదన్‌రావు – అద్దంకి శ్రీరాణి దంపతుల కుమార్తె ఖ్యాతి ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి మధుసూదన్‌రావు వ్యాపారం చేస్తుండగా, తల్లి శ్రీరాణి కామేపల్లి ఈజీఎస్ ఏపీఓగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి బాస్కెట్‌బాల్ ఆటపై ఇష్టం పెంచుకున్న ఖ్యాతి జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ లీగ్ పోటీలకు ఎంపికై ంది. ఈమేరకు హైదరాబాద్‌లో ముందస్తు శిబిరానికి బాలికతో పాటు ఆమె తండ్రి మధుసూదన్‌రావు పది రోజుల క్రితం వెళ్లారు. అక్కడ శిక్షణలో ప్రతిభ చాటి వికారాబాద్ మాంబాస్ జట్టులో ఖ్యాతి స్థానం దక్కించుకుంది. జూన్ 28 (ఆదివారం)న వికారాబాద్ మాంబాస్ – వరంగల్ స్టాలిన్స్ జట్ల నడుమ ఫైనల్స్ జరగాల్సి ఉండగా, అదేరోజు మధుసూదన్‌రావుకు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగానే మృతి చెందాడు. ఈ విషయం తెలియంతో ఖ్యాతి కన్నీరుమున్నీరైనా... సహచరులు అండగా నిలవడంతో మైదానంలోకి దిగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అనంతరం సోమవారం ఖమ్మంలో జరిగిన తండ్రి అంత్యక్రియలకు ఆమె హాజరైంది.


