మనస్తాపంతో ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో ఆత్మహత్య

Jul 1 2026 12:22 AM | Updated on Jul 1 2026 12:22 AM

రఘునాథపాలెం: భార్యతో ఘర్షణ జరగగా, ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. రఘునాథపాలెం మండలం పువ్వాడనగర్‌కు చెందిన ఏరువ నీహార్‌ (29) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి బానిసైన ఆయన, తల్లి శారద బంధువుల ఇంటికి వెళ్లిన సమయాన మంగళవారం ఉరి వేసుకున్నాడు. ఘటనపై నీహార్‌ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు.

ఆటోను ఢీకొట్టిన లారీ

ఆటోడ్రైవర్‌ మృతి

ఖమ్మంరూరల్‌: మండలంలోని గొల్లగూడెం వద్ద ఆటోను లారీ ఢీకొట్టగా ఆటోడ్రైవర్‌ కొలికపొంగు రవితేజ(35) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంనకు చెందిన రవితేజ కిరాయి నిమిత్తం వరంగల్‌ క్రాస్‌ నుంచి ఆరెంపుల వైపునకు ఆటోతో వెళ్తున్నాడు. మార్గమధ్యలో గొల్లగూడెం వద్ద వరంగల్‌ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఘటనలో ఆటో నడుపుతున్న రవితేజ తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్లలో రాగితీగ చోరీ

నేలకొండపల్లి: మండలంలోని పైనంపల్లిలోని పొలాల్లో రెండు ట్రాన్స్‌ఫార్మర్లను మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులో రాగి తీగ చోరీ చేశారు. ఈ మేరకు బాధిత రైతుల ఫిర్యాదుతో ఏఈ జి.రవి పరిశీలించారు. రైతుల నుంచి వివరాలు సేకరించిన ఆయన రైతులు అప్రమత్తంగా ఉంటూ అనుమానితుల వివరాలు తెలియజేయాలని సూచించారు. ఉద్యోగులు హన్మంతరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష

ఖమ్మంలీగల్‌: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఖమ్మం రూరల్‌ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మద్దెల వెంకటేశ్వర్లుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జికోర్టు న్యాయాధికారి కాకుమాను జ్యోతిర్మయి మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం ధంసలాపురానికి చెందిన మడూరి రాము వద్ద వెంకటేశ్వర్లు 2019 ఫిబ్రవరి లో రూ.3లక్షలు అప్పు తీసుకున్నాడు. తిరిగి 2020 జనవరిలో చెక్కు ఇచ్చినా సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో రాము తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌ జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేయగా విచారణ అనంతరం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.4.60 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.

చేపల లోడు వ్యాన్‌ బోల్తా

పెనుబల్లి: ట్రాక్టర్‌ను తప్పించే క్రమాన అదుపుతప్పిన చేపల లోడ్‌ వ్యాన్‌ బోల్తా పడింది. ఏపీలోని విశాఖపట్నం నుంచి పుణె వైపునకు చేపల లోడ్‌తో మంగళవారం వెళ్తున్న వ్యాన్‌ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనలో వ్యాన్‌ డ్రైవర్‌తోపాటు మరొకరికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ వ్యాన్‌లో ఇరుక్కోగా స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా, వ్యాన్‌ బోల్తాతో రోడ్డుపై చేపల బాక్స్‌లు చెల్లాచెదురుగా పడ్డాయి.

ట్రాక్టర్‌తో ఢీకొట్టి గాయపరిచాడని ఫిర్యాదు

కొణిజర్ల: పొలంలో నుంచి వెళ్లొద్దని సూచించినందున ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో ఢీకొట్టి గాయపరిచాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని తుమ్మలపల్లికి చెందిన బండి వెంకన్నకు గ్రామ సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన ఇజ్జగాని సత్యనారాయణ, ఆయన బావ గుండ్ల ధనమూర్తికి ఇచ్చిన భూమి విషయంలో వెంకన్నతో గొడవ జరిగింది. ఈ నెల 28న సత్యనారాయణ ట్రాక్టర్‌తో వెంకన్న పొలంలో నుంచి వెళ్తుండగా జీలుగ విత్తనాలు చల్లినందున పాడు చేయొద్దని చెబుతూ వెంకన్న అడ్డుకున్నాడు. అయినా సత్యనారాయణ ముందుకు వెళ్లడంతో వెంకన్న కింద పడగా, ఆయన పైనుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో కాళ్లు, నడుమకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై ఆయన కుమారుడి ఫిర్యాదుతో మంగళవారం సత్యనారాయణ, ధనమూర్తిపై కేసు నమోదు చేసిన ఎస్‌ఐ సూరజ్‌ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చికిత్స పొందుతున్న వెంకన్నను వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌, నాయకులు సూరంపల్లి రామారావు తదితరులు పరామర్శించారు.

నేడు సింగరేణి కార్యాలయం ఎదుట ధర్నా

రుద్రంపూర్‌: సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు జాతీయ కార్మిక సంఘాలైన ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌ ప్రతినిధులు తెలిపారు. అంతేకాక సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్ట్‌మెంట్లలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కొత్తగూడెంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడారు. 11వ వేతన ఒప్పందం ముగిసినందున కాలయాపన లేకుండా 12వ వేతన కమిటీని ఏర్పాటు చేసి 40 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన ఒప్పంద పక్రియ ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, నాలుగు లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని, ఇవి అమలయ్యే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. జాతీయ కార్మిక సంఘాల నాయకులు కొరిమి రాజ్‌కుమార్‌, సి.త్యాగరాజన్‌, మందా నర్సింహారావు, వంగా వెంకట్‌, వీరస్వామి, మల్లికార్జున్‌రావు, రమణమూర్తి, క్రిస్టోఫర్‌, కత్తెర్ల రాములు, గట్టయ్య, హుమాయిన్‌, మాతంగి లింగయ్య, బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు, ఆల్బర్ట్‌, పీతాంబరరావు, విజయగిరి శ్రీనివాస్‌ ఎం.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement