విస్తారంగా వానలు | - | Sakshi
Sakshi News home page

విస్తారంగా వానలు

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

● బోనకల్‌లో 10.92 సెం.మీ.ల వర్షపాతం ● అన్నదాతల్లో ‘ఏరువాక’ ఆనందం

● బోనకల్‌లో 10.92 సెం.మీ.ల వర్షపాతం ● అన్నదాతల్లో ‘ఏరువాక’ ఆనందం

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఈనెల 29వ తేదీ నాటికి నిర్దేశిత సాధారణ వర్షపాతం 124.5 మి.మీ.కు గాను 168.9 మి.మీ.గా నమోదైంది. కామేపల్లి, ఖమ్మం రూరల్‌, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, వైరా, బోనకల్‌, మధిర మండలాల్లో సాధారణానికి మించి 20 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

కొన్నిచోట్ల తక్కువే...

జిల్లాలోని 12 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైనా రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్‌, కొణిజర్ల, వేంసూరు మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఇక సింగరేణి, కూసుమంచి, సత్తుపల్లి, ఎర్రుపాలెం మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్ల డించారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సత్తుపల్లి, వేంసూరు మినహా అన్ని మండలాల్లో వర్షం కురవగా, బోనకల్‌ మండలంలో అత్యధికంగా 109.2 మి.మీ.(10.92 సెం.మీ)ల వర్షపాతం నమోదైందని నివేదికలో వెల్లడించారు. అలాగే, కల్లూరు మండలంలో 74.6, తల్లాడలో 48.6, ముదిగొండలో 44.6, ఖమ్మం రూరల్‌లో 43.6, తిరుమలాయపాలెంలో 42.8, పెనుబల్లిలో 42.2, మధిరలో 41.2, వైరాలో 39.2, ఏన్కూరులో 35.2, చింతకానిలో 33.6, ఖమ్మం అర్బన్‌లో 30.8, రఘునాథపాలెంలో 30.6, నేలకొండపల్లిలో 24.2, కామేపల్లిలో 20.2, ఎర్రుపాలెంలో 16.2, కొణిజర్లలో 14.2, కూసుమంచిలో 13.8, సింగరేణిలో 11.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.

సాగు.. వేగిరం

వరుణుడి కటాక్షంతో జిల్లాలో పంటల సాగు వేగం పుంజుకోనుంది. ఎల్‌నినో ప్రభావంతో ఇన్నాళ్లు వర్షాలు కురవకపోగా ఎండల తీవ్రత కొనసాగింది. అయితే, సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా వర్షాలు జోరందుకోవడం అన్నదాతల్లో ఆనందాన్ని నింపింది. జిల్లాలో వానాకాలం సీజన్‌లో అన్నీ కలిపి 5.67 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఇప్పటి వరకు 92,451 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా పత్తి విత్తనాలు 83,547 ఎకరాల్లో నాటారు. ప్రస్తుత వర్షాలతో మిగిలిన పంటల సాగు గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈమేరకు రైతులు పత్తి, మిర్చితో పాటు వరి విత్తనాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement