ఖమ్మంలోని కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత చదువు కలెక్టర్ దివాకర నిర్ణయంతో 122పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లు
ఖమ్మంమయూరిసెంటర్: నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన అమలుచేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకంలో జిల్లా కలెక్టర్ దివాకర తీసుకున్న చొరవ పలువురికి మేలు చేసింది. పెండింగ్ బకాయిల సాకుతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ పథకానికి దూరంగా ఉండడంతో నిరాశలో మునిగిపోయిన పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కలెక్టర్ అండగా నిలిచారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో సీట్లు ఇప్పించడం తల్లిదండ్రుల ఆనందానికి కారణమైంది.
నాడు నిరాశ.. నేడు సంబరం
బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం కొనసాగుతున్న పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు నిలిచిపోయాయి. దీంతో ఈ ఏడాది ఖమ్మంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలు ఈ పథకం కింద సీట్లు ఇచ్చేందుకు నిరాకరించాయి. కనీసం తమ పాఠశాలల పేర్లు నమోదు చేసుకోలేదు. ఫలితంగా విద్యార్థులకు లాటరీ కేటాయించే కార్యక్రమానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల జాబితా చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయమై అధికారులు ఇచ్చిన సమాచారంతో కలెక్టర్ స్పందించారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి అన్నింట్లో బీఏఎస్ పథకం ద్వారా విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించారు. దీంతో లాటరీ వాయిదా వేశారు.
పాఠశాలల నమోదుకు చర్యలు
అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బీఏఎస్ సీట్లు కేటాయించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేయడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పథకంలో స్కూళ్ల పేర్లు నమోదు చేయించి లాటరీ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. అంతేకాక విద్యార్థులకు సీట్లు ఇచ్చిన పాఠశాలల పేర్లను బీఏఎస్ పథకంలో నమోదు చేసేలా రాష్ట్ర శాఖకు నివేదిక పంపించారు. విద్యార్థుల ఎంపికకు ముందే పాఠశాలల పేర్లను నమోదు చేయాల్సి ఉన్నా.. ఈ ఏడాది చోటు చేసుకున్న పరిణామాలతో ఆలస్యమైంది.
అప్పుడు 5.. ఇప్పుడు 68
గతంలో ఖమ్మం నగరంలో ఐదు, జిల్లా వ్యాప్తంగా పది లోపు పాఠశాలలే ఈ పథకం ద్వారా సీట్లు కేటాయించేవి. కానీ కలెక్టర్ సూచనలతో ఏకంగా నగరంలోని 68 ప్రైవేట్ పాఠశాలలకు సీట్ల కేటాయింపులు జరిగాయి. ఒకటో తరగతిలో 121మంది విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో సీట్లు కేటాయించగా, 5వ తరగతి విద్యార్థులు 138 మందిని 41 ప్రైవేట్ పాఠశాలలకు కేటాయించారు. ఫలితంగా 1వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు 10వ తరగతి వరకు పైసా ఫీజు లేకుండా ఉచితంగా చదువుకునే అవకాశం దక్కింది. వీరికి ఉచితంగా పాఠ్యపుస్తకాలను కూడా జిల్లా యంత్రాంగం అందించనుంది. ఇక ఐదో తరగతిలో చేరిన విద్యార్థులకు వసతి సౌకర్యం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌తో కూడిన నాణ్యమైన విద్య ఉచితంగా అందుతుంది.
బీఏఎస్ పథకానికి మొదటి సారి లాటరీ ఏర్పాటుచేసినప్పుడు తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. దీంతో కలెక్టర్ చొరవ తీసుకోగా ఈ ఏడాది 121 పాఠశాలలు బీఏఎస్ పథకం ద్వారా సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. విద్యార్థులకు ప్రముఖ పాఠశాలల్లో సీట్లు లభించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
– జి.జ్యోతి, ఎస్సీ డీడీ, ఖమ్మం
బెస్ట్ అవైలబుల్ సీట్ల కేటాయింపులో చొరవ


