ఖమ్మంవైద్యవిభాగం: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని మధిర ఏరియా ఆస్పత్రి, కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గైనకాలజిస్టుల నియామకానికి జూలై 1న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్) కె.రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. అంతరాయం లేకుండా వైద్యసేవలు అందించే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మధిర ఆస్పత్రి, కల్లూరు సీహెచ్‌సీలో ఒక్కో గైనకాలజిస్టును నియమించనుండగా ఎంబీబీఎస్‌తో పాటు ఎంఎస్ ఉత్తీర్ణులైన వారు అర్హులని, అదనపు అర్హతలు, పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌లు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో జూలై 1న కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని డీసీహెచ్‌ఎస్ ఓ ప్రకటనలో సూచించారు. ఇతర వివరాలు, దరఖాస్తు నమూనా కోసం https:// khammam. telangana. gov. in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని తెలిపారు.
అర్హులైన ఖైదీలకు
ఉచిత న్యాయసాయం
ఖమ్మంలీగల్: అర్హత కలిగిన ఖైదీలకు అవసరమైన న్యాయసాయం ఉచితంగా అందేలా చూస్తామని జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. ఈమేరకు సోమవారం జిల్లా కారాగారాన్ని సందర్శించిన ఆమె ఖైదీలతో మాట్లాడారు. చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయసాయం, ఖైదీల సంక్షేమానికి అమల్లో ఉన్న అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఫిర్యాదుల పెట్టె, న్యాయ సహాయ కేంద్రం హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ శ్రీధర్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆతర్వాత జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి దేవీమానస బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అక్కడి చిన్నారుల సంక్షేమంపై ఆరా తీశారు. ఆతర్వాత మాదకద్రవ్యాలతో ఎదురయ్యే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని ప్రారంభించారు.
ఇంటెలిజెన్స్ ఉమ్మడి జిల్లా ఎస్పీగా రమేష్
ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామోజీ రమేష్ నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు నాన్ క్యాడర్ ఏపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈనేపథ్యాన ఇటీవల ఎస్పీగా పదోన్నతి పొందిన రమేష్‌కు ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఆయన ఉమ్మడి జిల్లా ఇంటిలిజెన్స్ ఐఆర్‌ఓ(అడిషనల్ ఎస్పీ)గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పోస్ట్‌ను ఎస్పీగా స్థాయికి అప్‌గ్రేడ్ చేయగా, రమేష్‌ను నియమించారు. 1989 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన రామోజీ రమేష్ ఉమ్మడి జిల్లాలో చాన్నాళ్లు విధులు నిర్వర్తించారు. ఈమేరకు ఆయనను సీపీ సునీల్‌దత్, తదితరులు అభినందించారు.
రూ.9.67కోట్లకు స్టాక్ మార్కెట్ వ్యాపారి ఐపీ
ఖమ్మం లీగల్: ఖమ్మం రాఘవేంద్ర నగర్‌కు చెందిన స్టాక్ మార్కెట్ వ్యాపారి మైలవరపు నాగసందీప్ రూ.9.67కోట్లకు దివాళా పిటీషన్(ఐపీ) దాఖలు చేశాడు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి కోసం స్నేహితుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయగా, ప్రస్తుతం నష్టాలు రావడంతో తీర్చలేని పరిస్థితి ఎదురైందని పిటీషన్‌లో పేర్కొన్నాడు. ఈమేరకు 31మందిని ప్రతివాదులుగా చేరుస్తూ తన న్యాయవాది ద్వారా ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సోమవారం ఐపీ దాఖలు చేశాడు.


