సత్తుపల్లిటౌన్: కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకడంతో షాక్‌కు గురైన ఓ వ్యక్తి మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన రెడ్డిపోగు వెంకటేశ్వరరావు(40) సోమవారం ట్రక్ లారీపై జేసీబీని తీసుకుని వస్తున్నాడు. ఈక్రమాన పైన కూర్చున్న ఆయనకు సత్తుపల్లి మండలం చెరుకుపల్లి వద్ద నీలాద్రి రోడ్డులో నుంచి కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకగా షాక్‌కు గురై స్పృహ కోల్పోయాడు. ఈమేరకు వెంకటేశ్వరరావును సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
కల్లూరు రూరల్: కల్లూరు మండలం చెన్నూరు పంచాయతీ పరిధిలోని రావికంపాడు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కల్లూరు నుంచి చెన్నూరు వైపుగా బైక్‌పై కోలా సాయి(19) వెళ్తుండగా రావికంపాడు హైస్కూల్ సమీపాన ఐషర్ ట్రాక్టర్ ఢీట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ సిగ్నల్ ఇవ్వకుండా ఒకేసారి తిప్పడంతో సాయికి తాకి మృతి చెందాడని ఆయన తండ్రి వెంకయ్య సోమవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కల్లూరు ఎస్సై హరిత తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ..
రఘునాథపాలెం: రఘునాథపాలెంకు చెందిన కందుల నర్మద(38) ఈనెల 14న జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమె తన కుమారుడు లోహిత్, కుమార్తె అక్షయతో కలిసి ద్విచక్ర వాహనంపై రఘునాథపాలెంలోని కేటీఆర్ కాలనీకి వెళ్తుండగా, ఇల్లెందు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో పిల్లలు సహా నర్మదకు తీవ్రగాయాలయ్యాయి. ఇందులో అక్షయకు వీపు భాగంలో ఎముక విరగగా, లోహిత్‌కు కాలికి తీవ్ర గాయమైంది. ఇక నర్మద తలకు బలమైన గాయం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆపై ఈనెల 25న ఖమ్మం మమత ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. ఘటనపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మధిరలో గుర్తుతెలియని వ్యక్తి..
మధిర: మధిరలో గుర్తు తెలియని ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. స్థానిక రిలయన్స్ మార్ట్ సమీపాన అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు టౌన్ పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.


