ఖమ్మంరూరల్: ఆడుకుంటూ తప్పిపోయిన బాలుడిని చేరదీసిన పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్డు సుందరయ్యనగర్‌కు చెందిన అయాన్ ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి దారి తప్పాడు. దీంతో కుమారుడు కనిపించక తల్లిదండ్రులు షేక్ అస్లాం పాషా, ఎండీ తహేరా, బంధువులు గాలింపు మొదలుపెట్టారు. ఇదే సమయాన టీఎన్జీవోస్ కాలనీ సమీపానికి చేరుకున్న అయాన్‌ను గుర్తించిన ఖమ్మంరూరల్ పోలీసులు చేరదీసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాక ఫొటోలను వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్ట్ చేశారు. మరోపక్క ఆయన తల్లిదండ్రులు కూడా వాట్సప్ ద్వారా వివరాలు షేర్ చేశారు. ఈ రెండు పోస్టులు వైరల్‌గా మారడంతో కొద్ది సేపట్లోనే కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో అస్లాం దంపతులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అయాన్‌ను అప్పగించడంతో ఆనందిస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, సుందరయ్యనగర్ నుంచి బాలుడు ఒంటరిగా టీఎన్‌జీవోస్‌కాలనీ వరకు ఎలా వచ్చాడో చెప్పలేకపోవడంతో అది మిస్టరీగానే మిగిలిపోయింది.
వాట్సప్ పోస్టులతో చేరిన సమాచారం


