ఖమ్మంమామిళ్లగూడెం: ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’కార్యక్రమం ప్రజ ల్లో సామాజిక బాధ్యతనే కాక పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై అవగాహన పెంపొందిస్తోందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సన్నె ఉదయప్రతాప్ అన్నారు. ఖమ్మంలోని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ నివాసంలో ఆదివారం మన్ కీ బాత్‌ను నాయకులు, స్థానికులు వీక్షించారు. ఈ సందర్భంగా ఉదయప్రతాప్ మాట్లాడుతూ.. సహజసిద్ధమైన బ్రిడ్జిల విశిష్టత, ప్రకృతి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి ప్రాముఖ్యతను మోదీ వివరించారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జ్వాలా నర్సింహారావు, మేకల నాగేందర్, దాసరి మధు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
పాస్‌పుస్తకాలు
మంజూరు చేయాలి
ఏన్కూరు: భూ భారతి ద్వారా సమగ్ర భూసర్వే చేపట్టి కాస్తు ఆధారంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివారం ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఇకనైనా ప్రభు త్వం శ్రద్ధ చూపాలని కోరారు. అలాగే, జిల్లా లో ఏడు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టు పూర్తికి సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు దుగ్గికృష్ణ, తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, బానోతు బాలాజీ, నరేంద్ర, డి.నాగేశ్వరరావు, అంబటి శ్రీనివాసరెడ్డి, బాణాల శ్రీనివాసరావు, కాలసాని సాయి, ఏర్పుల రాములు, ఇటికాల లెనిన్, గుండా సత్యనారాయణరెడ్డి, జానీ పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలి
ముదిగొండ: ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముదిగొండ మండలంలోని పెద్దమండవ, మల్లారం సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు విస్తృత తనిఖీలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ మురళి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించారు. అర్చకుడు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
రాకేశ్‌కు ఎన్‌ఐఎస్ కోచ్‌గా గుర్తింపు
పాల్వంచ: పాల్వంచకు చెందిన బాస్కెట్‌బాల్ కోచ్ ఉప్పుశెట్టి రాకేశ్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎన్‌ఐఎస్ (నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్) నుంచి కోచ్‌గా గుర్తింపు లభించింది. బెంగళూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన కొనసాగుతున్న నేతాజీ సుభాష్ సదరన్ సెంటర్‌లో ఆయన బాస్కెట్‌బాల్ కోర్సు పూర్తి చేయడంతో ఎన్‌ఐ ఎస్ సర్టిఫికెట్ జారీచేశారు. ఆధునిక శిక్షణ విధానాలు, క్రీడావిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వానికి సంబంధించిన అంశాల్లో కోర్సు పూర్తిచేసిన రాకేశ్‌ను పలువురు క్రీడాకారులు అభినందించారు.


