స్థల పరిశీలన పూర్తి
● ఏన్కూరు ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ● గిరిజనానికి అందనున్న మెరుగైన వైద్యం ● రెండు జిల్లాల్లోని ఆరు మండలాల ప్రజలకు మేలు
ఏన్కూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అప్‌గ్రేడ్ కానుంది. ఆరు పడకలుగా ఉన్న ఈ ఆస్పత్రిని 30 పడకల వైద్యశాలగా స్థాయి పెంచాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. తద్వారా ఇక్కడ గిరిజనులకు 24 గంటల పాటు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఎకరం 20 కుంటల స్థలం
ప్రస్తుత ఆరోగ్య కేంద్రం ఆవరణ ఒక ఎకరం 20 కుంటల్లో ఉంది. ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యాన వైద్యవిధాన పరిషత్ ద్వారా 30 పడకల ఆస్పత్రి నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆరోగ్యకేంద్రంలో నిత్యం 100 మంది వరకు వైద్యసేవలు పొందుతున్నారు. అయితే, స్థాయి తక్కువ కావడంతో అత్యవసర వైద్యం అందక ఖమ్మం ఆస్పత్రికి సిఫారసు చేయక తప్పడం లేదు. దీంతో అక్కడికి వెళ్లలేక, ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థోమత లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యాన ఏన్కూరులో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటైతే ఖమ్మం జిల్లాలోని కారేపల్లి, తల్లాడ, కామేపల్లి, ఏన్కూరు, కొణిజర్ల మండలాలతో పాటు భద్రాద్రి జిల్లాలోని జూలూరుపాడు మండలంలోని గిరిజనులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది.
మూడు షిఫ్ట్‌ల్లో వైద్యం
మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలుగా అప్‌గ్రేడ్ చేస్తే 15 మంది వైద్యులు మూడు షిఫ్ట్‌ల్లో 24 గంటల పాటు వైద్యసేవలు అందిస్తారు. ఇందులో గైనకాలజిస్ట్, ఎముకల డాక్టర్, చిన్నపిల్లల వైద్యుడు, అనస్తీషియన్, జనరల్ ఫిఝీషియన్‌తోపాటు పలువురు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారు. సర్జరీల నిర్వహణకు కూడా అవకాశం ఏర్పడడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందుతాయి.
ఇప్పటికే డయాలసిస్ సెంటర్
ఏన్కూరు ప్రభుత్వ ఆరోగ్యకేంద్రానికి ఇప్పటికే డయాలసిస్ సెంటర్ మంజూరైంది. జిల్లాలో వైరా, తిరుమలాయపాలెం, కల్లూరు, నేలకొండపల్లి, పెనుబల్లితో పాటు ఏన్కూరుకు కూడా కొన్నాళ్ల క్రితం డయాలసిస్ సెంటర్లు కేటాయించారు. వైరా, తిరుమలాయపాలెంలో ఏడేసి పడకలు, కల్లూరు, నేలకొండపల్లి, ఏన్కూరు, పెనుబల్లిలో ఐదు పడకల ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి డయాలసిస్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రి 30 పడకలకు అప్‌గ్రేడ్ అయింది. భవన నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన కూడా చేశారు. ఎకరం 20 కుంటల్లో భవనం నిర్మాణం పూర్తయితే, 24 గంటల పాటు అత్యవసర చికిత్సలు, ఆపరేషన్లు జరుగుతాయి. చుట్టుపక్కల గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.
– ఎన్.బాలకృష్ణ, ప్రభుత్వ వైద్యాధికారి, ఏన్కూరు


