భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
రామయ్య సన్నిధిలో ప్రముఖులు
స్వామివారిని ఆదివారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నోరి దత్తాత్రేయుడు, ఛత్తీస్‌గఢ్ అటవీశాఖ మంత్రి కేదార్ కశ్యప్, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ ఈఓ దామోదర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.


