రఘునాథపాలెం: మండలంలోని రేగులచలక, కోయ చలక గ్రామాల్లో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహా రం చేసింది. రేగులచలక ఎస్సీకాలనీకి వచ్చిన కుక్క అక్కడ ఇంటి ముందు ఆడుకుంటున్న ఆర్‌ఎంపీ నార పోగు రాంబాబు కుమారుడు శశీంద్ర ముఖంపై దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. అలాగే, కలకోట కృష్ణ, మరో వ్యక్తిని సైతం కుక్క కరిచింది. అంతేకాక పశువులు, కోళ్లను కూడా కరిచిందని గ్రామస్తులు తెలిపారు. కాగా, శశీంద్రకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆలయ హుండీ తాళాలు
ధ్వంసం
కేశవాపురం గ్రామంలో ఉద్రిక్తత
తల్లాడ: మండలంలోని కేశవాపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ హుండీ తాళాలను ఆదివారం ఓ వర్గం వారు పగలగొట్టారు. వచ్చేనెల మొదటి వారం ఆలయ వార్షికోత్సవం నిర్వహించనుండగా, జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ల క్రితం ఆలయ నిర్వహణ, హుండీ విషయమై గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పట్లో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల సమక్షాన హుండీకి రెండు తాళాలు వేశారు. భవిష్యత్‌లో అందరూ ఏకతాటిపైకి వచ్చాకే రెండు తాళాలను తెరవాలని నిర్ణయించారు. ఇంతలో ఆదివారం ఓ వర్గం వారు హుండీ తాళాలు తీస్తామని గ్రామంలో చాటింపు వేయించడమే కాక తాళాలను పగలగొట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఎప్పుడేం జరుగుతోందనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై స్థానికులు పలువురు తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


